ఆంక్షల చిత్రం | - | Sakshi
Sakshi News home page

ఆంక్షల చిత్రం

Aug 22 2026 2:05 AM | Updated on Aug 22 2026 2:05 AM

ఆంక్షల అమలులో వైఫల్యం?

కుంకుళ్లమ్మ ఆలయంలో ఫొటోలు, వీడియోల చిత్రీకరణపై ఆంక్షలు

దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాలని చెబుతున్న అధికారులు

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో చినవెంకన్న సోదరిగా పూజలందుకుంటున్న శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారు వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని శాకంబరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గర్భాలయంతో పాటు ఆలయ ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక అలంకారాలు చేశారు. అయితే ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తిని ఉంచడానికి బదులుగా, ఆమె ఫ్లెక్సీకి అలంకరణ చేయడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ స్పష్టంగా కనిపిస్తూ, దాని ఎదురుగా వైర్లు వేలాడుతుండటంపై విస్తుపోయారు. శ్రీవారి ఉపాలయాల్లోనే అత్యధిక ఆదాయం కలిగిన ఈ ఆలయంలో ఉత్సవమూర్తికి పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్‌ దండలతో అలంకరించి ఉంటే బాగుండేదని వాపోయారు.

మీడియా చిత్రీకరణపై ఆంక్షలు

దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆలయాల్లో మూలవిరాట్ల ఫొటోలు, వీడియోలు తీయడంపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో కుంకుళ్లమ్మ ఆలయంలోనూ అమ్మవారి అలంకారాన్ని చిత్రీకరించేందుకు మీడియాకు అనుమతి లభించలేదు. స్వయంగా ఆలయానికి రాలేని వేలాది మంది భక్తులకు ఉగాది గాజుల అలంకారం, శ్రావణమాస శాకంబరీ అలంకారం, దసరా ఉత్సవాల విశేషాలు మీడియా, సోషల్‌ మీడియా ద్వారానే తెలిసేవి. తాజా ఆంక్షల వల్ల భక్తులు ఈ అలంకార వైభవానికి దూరమవుతున్నారని, చిన్న ఆలయాల విశిష్టతను ప్రచారం చేయడంలో మీడియా పాత్రను తగ్గించేలా కమిషనర్‌ నిర్ణయం ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

సాంప్రదాయాలపై ఆంక్షలు సరికావు

ఆలయాలకు వెళ్లలేని భక్తులకు దేవతామూర్తుల అలంకార దర్శనం లేకుండా చేయడం సరికాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను ఆధ్యాత్మికతకు చేరువ చేయాల్సింది పోయి, ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలపై ఆంక్షలు విధించి దేవుళ్లను దూరం చేస్తున్నారని మండిపడుతున్నారు. కనీసం ఉత్సవమూర్తుల ద్వారా అయినా అమ్మవారి వైభవాన్ని దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని ఆలయాల్లో మాత్రం దేవతామూర్తుల అలంకారాల ఫొటోలు యథావిధిగా సోషల్‌ మీడియాలో కనిపిస్తుండటం చర్చనీయాంశమైంది. భీమవరంలో మావుళ్లమ్మ అమ్మవారి గాజుల అలంకారం ఫొటోలతో పాటు మరికొన్ని ఆలయాల ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల అమలులో ఆలయాల వారీగా వ్యత్యాసాలు ఉన్నాయా లేదా ఆదేశాల్లో స్పష్టత లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement