ఇరగవరం: మండలంలోని రేలంగి గ్రామంలోని అంతన్నవారిపేట వద్ద ఉన్న పాత వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. ఇరగవరం మండలానికి ఉన్న ఏకై క రైల్వే స్టేషన్ రేలంగి మాత్రమే. ఈ స్టేషన్‌తో పాటు అత్తిలి, తణుకు, గుమ్మంపాడు, వరిగేడు, బల్లిపాడు తదితర 21 గ్రామాల ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు నిత్యం ఈ వంతెనపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది.
ఊడిపోయిన రెయిలింగ్.. కుంగిపోతున్న వంతెన
బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన దశాబ్దాలుగా ప్రజలకు సేవలందించినప్పటికీ ప్రస్తుతం సరైన నిర్వహణ లేక దెబ్బతింది. వంతెనకు ఇరువైపులా ఉన్న రెయిలింగ్ ఊడిపోవడంతో వాహనాలు తరచూ పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్తున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను కాపాడుతున్నారు. వంతెన కింది భాగం బీటలు వారి కుంగిపోతోందని, గర్రండీలు ఊడిపోవడంతో ప్రయాణించే సమయంలో తీవ్రంగా కంపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీ వాహనాలతో ప్రమాద హెచ్చరిక
ప్రతిరోజూ ఈ వంతెనపై స్కూల్ బస్సులు, భారీ వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఆ సమయంలో వంతెన విపరీతంగా ఊగుతుండటంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
మేము పుట్టకముందు బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతో ఉపయోగపడింది. కానీ, అధికారులు దీని నిర్వహణను పట్టించుకోకపోవడంతో రోజురోజుకూ దెబ్బతింటోంది. రెయిలింగ్ ఊడిపోయి, కింది భాగం కుంగిపోతోంది. భారీ వాహనాలు వెళ్తున్నప్పుడు తీవ్రంగా ఊగుతోంది. వంతెన పూర్తిగా కూలిపోయి పెను ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి కొత్త వంతెన నిర్మించాలి.
– గుదే రవితేజ, రేలంగి (అంతన్నవారిపేట)
బీటలు తీసి కుంగిపోతున్న వంతెన
రెయిలింగ్ ఊడిపోయి ప్రమాదకరంగా ఉన్న రేలంగి అంతన్నవారి పేట వద్ద ఉన్న వంతెన


