ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): యువతకు ఉద్యోగాలు కల్పించాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏలూరు జిల్లా కన్వీనర్ తొర్లపాటి రాజు డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్యర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థ విధానాల కారణంగా యువత నిరుద్యోగం, ఉపాధి, వలసలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిఏటా కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. పోటీ పరీక్షల్లో జాప్యం, పేపర్ లీకులు, పరీక్షల రద్దు, నియామక ప్రక్రియలో అవకతవకల వల్ల నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్, 4 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, కొత్త పరిశ్రమల ఏర్పాటు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యుడు కురెళ్ల వరప్రసాద్ మాట్లాడుతూ 2025 మెగా డీఎస్సీలో పేపర్ లీకేజీ, మెరిట్ జాబితా అక్రమాలు, స్పోర్ట్స్ కోటా దుర్వినియోగంపై హైకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏఐవైఎఫ్ మాజీ కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ నీట్ పరీక్షల బాధ్యత రాష్ట్రాలకు అప్పగించాలని, పీపీపీ విధానాన్ని రద్దు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, యువజన సమాఖ్య మాజీ నాయకులు భజంత్రి శ్రీనివాస్, నాగం అచ్యుత్, పార్టీ సభ్యులు బళ్ల కనకదుర్గరావు, మావూరి విజయ తదితరులు పాల్గొన్నారు.


