భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునీత కలెక్టర్లకు ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సీహెచ్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ, 409 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీటిలో 16 గ్రామాలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రెండు విడతల్లో పోలింగ్‌కు ప్రతిపాదనలు పంపామని, మొదటి విడతలో నరసాపురం డివిజన్‌లో 8 మండలాల్లోని 165 పంచాయతీలు. తాడేపల్లిగూడెం డివిజన్‌లోని ఇరగవరం, అత్తిలి రెండు మండలాల్లోని 39 పంచాయతీలు ఉన్నాయన్నారు. రెండో విడతలో భీమవరం డివిజన్‌లోని 7 మండలాల్లో 143 పంచాయతీలు, తాడేపల్లిగూడెం డివిజన్‌లోని పెంటపాడు, తణుకు తాడేపల్లిగూడెం మండలాల్లో 62 పంచాయతీలు ఉన్నాయన్నారు. అలాగే 4,579 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా.. సుమారు 3,366 కేంద్రాలను ఆన్‌లైన్‌లో మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా తయారీ ఈనెల 21న, జాబితా ప్రచురణ 23న, వినతులు, అభ్యంతరాల స్వీకరణకు 26 వరకు, కేంద్రాల జాబితా ఆమోదానికి 29న, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురణకు ఆగస్టు 31గా షెడ్యూల్ ప్రకటించామన్నారు. అలాగే జిల్లాలో ఓటర్ల ప్రచురణకు సమగ్ర ప్రణాళిక అమలు చేయా లన్నారు. డీపీఓ అనూరాధ, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ సీహెచ్ నాగరాణి


