ఏలూరు టౌన్: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) ఏలూరు జిల్లా కార్యాలయం విషయంలో ప్రభుత్వ అధికారులు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పార్టీ కార్యకలాపాలను అడ్డుకోవటం అభ్యంతరకరమని వైఎస్సార్‌సీపీ జిల్లా లీగల్‌సెల్ అధ్యక్షుడు సీహెచ్ రాజేంద్రప్రసాద్ అన్నారు. బుధవారం ఏలూరు జాయింట్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ అభిషేక్ గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా విద్యుత్‌శాఖ అధికారులు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏలూ రు ఏఎస్‌ఆర్ స్టేడియం సమీపంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం అంశంపై డబ్ల్యూపీ నం. 13427 ఆఫ్ 2026, డబ్ల్యూపీ నం.22124 ఆఫ్ 2025 మేరకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని స్పష్టం చేశారు. విద్యుత్‌శాఖ ఇష్టారాజ్యంగా సరఫరా నిలిపివేస్తూ నిబంధనలు మీరుతుందని, గతంలోనూ ఇదే తరహాలో విద్యుత్ సరఫరా కట్ చేసిన సందర్భంలో కోర్టు ఉత్తర్వులతో సరఫరా పునరుద్ధరించారని తెలిపారు. కార్యాలయానికి తాళాలు వేయటం, కార్యకలాపాలను అడ్డుకోవటం చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీనిపై ఏలూరు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్‌గా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో న్యాయవాది ఆచంట వెంకటేశ్వరరావు ఉన్నారు.


