ఏలూరు టౌన్: విద్యార్థుల సురక్షిత ప్రయాణంపై విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. మంగళవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యాసంస్థల వాహన డ్రైవర్లు భద్రతా ప్రమాణాలు పాటించేలా స్కూల్స్, కళాశాలల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యాసంస్థకు చెందిన ప్రతి బస్సులోనూ విధిగా డాష్‌బోర్డ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. ఎలాంటి నేర నేపధ్యం లేని బాధ్యతాయుతమైన డ్రైవర్లును మాత్రమే నియమించుకోవాలని ఆదేశించారు. బస్ డ్రైవర్‌కు విధిగా యూనిఫామ్, గుర్తింపు కార్డు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌టీవో శేఖర్, ఎంవీఐ విఠల్, విద్యాసంస్థల బస్సుల యాజమాన్యాలు పాల్గొన్నారు.
నెలాఖరులోగా ఏర్పాటు చేసుకోవాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సుల్లో వీఎల్‌టీడీ, డ్యాష్‌బోర్డ్ కెమెరాలను ఈ నెలాఖరు నాటికి ఏర్పాటు చేసుకోవాలని ఇన్‌ఛార్జి ఆర్టీవో బాలేందు శేఖర్ స్పష్టం చేశారు. చొదిమెళ్లలోని డీటీసీ కార్యాలయంలో విద్యాసంస్థల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో, ప్రమాదాలు జరిగినప్పుడు డ్యాష్‌బోర్డ్ కెమెరా వీడియోలు కీలక సాక్ష్యాలుగా ఉపయోగపడతాయన్నారు. సమావేశంలో వాహన తనిఖీ అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులు, పాల్గొన్నారు.


