ముసునూరు: మండల కేంద్రం ముసునూరు–కాట్రేనిపాడు సరిహద్దులోని ఓ ప్రైవేటు పాప్‌కార్న్ కంపెనీలో రసాయనిక వాయువులు వెలువడి కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాల ప్రకారం.. పాప్‌కార్న్ కంపెనీలో కార్మికులు ఉదయం పని చేస్తున్న సమయంలో ఇద్దరికి ఊపిరి పీల్చుకునే విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. చూస్తూ ఉండగానే వారు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో యాజమాన్యం స్పందించి ముసునూరు పీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి గంగాధరరావు ప్రథమ చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండడంతో నూజివీడుకు రిఫర్ చేశారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. తక్షణ వైద్య సేవలు అందించడంతో క్షతగాత్రుల ఆరోగ్యం కుదుట పడింది. తక్షణమే ఆసుపత్రికి తరలించడం వలన అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించినట్లు ఏరియా ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. గాలి ప్రవేశించకుండా ఉండడం వలన విష వాయువులు, రసాయనాలతో తీవ్ర ప్రమాదం సంభవిస్తుందని జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ప్రమాదంపై యజమాని మాట్లాడుతూ కార్మికులు రాత్రి ఒంగోలులో పని చేసి అలసటతో వచ్చి, ఏమీ తినకుండానే ఇక్కడ పనిలోకి రావడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. బాధితులకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరేంత వరకు పూర్తి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.


