ఉంగుటూరు: ముందు వెళ్తున్న ఆటోను వెనుకనుంచి మోటార్‌సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి బాదంపూడి బైపాస్ వద్ద జరిగింది. ప్రమాద వివరాలను చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ వెల్లడించారు. భీమడోలు మండలం కొండ్రుపాడు గ్రామానికి చెందిన నరెడ్ల దొరబాబు (30), దాసరి నాగరాజు పనుల నిమిత్తం తణుకు మండలం తేతలి గ్రామానికి వెళ్లారు. పని పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి మోటార్‌సైకిల్‌పై వస్తుండగా.. బాదంపూడి బైపాస్ రోడ్డులో వెలమళ్ళ సర్వీస్ రోడ్డులోకి ముందుగా రేకులు లోడుతో వెళుతున్న ఆటో ఒక్కసారిగా తిరగడంతో, వెనుక వస్తున్న మోటార్‌సైకిల్ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరెడ్ల దొరబాబు, దాసరి నాగరాజులను హైవే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే దొరబాబు మృతి చెందాడు. రేకులతో వెళ్తున్న ఆటో డ్రైవర్ దేశంశెట్టి నాగేశ్వరరావు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా ఆటో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒకరి మృతి, మరొకరికి గాయాలు


