వసతులు మృగ్యం.. చదువుకు దూరం | - | Sakshi
Sakshi News home page

వసతులు మృగ్యం.. చదువుకు దూరం

Aug 18 2026 9:14 AM | Updated on Aug 18 2026 9:14 AM

లిఖిత పూర్వకంగా అర్జీ ఇస్తే చర్యలు తీసుకుంటాం

చాట్రాయి: అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రకటనలు ఆచరణలో నీరుగారిపోతున్నాయి. చాట్రాయి మండలంలో పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల లేమితో మూతపడుతుండటంతో పేద విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారుతోంది. రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు అధికారుల నిర్లక్ష్యంతో పేదలకు దూరమవుతోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసంపూర్తి పనులతో టాయిలెట్ల కష్టాలు

మండలంలోని జనార్దనవరం దళితవాడ ప్రాథమిక పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో ‘నాడు–నేడు’ పథకం కింద రూ.2.68 లక్షలతో టాయిలెట్ల నిర్మాణం ప్రారంభించారు. అయితే ఎన్నికల ముందు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇవి పూర్తికాకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఉపాధ్యాయులు పక్క ఇళ్లకు వెళ్లాల్సి వస్తుండగా, విద్యార్థులు మరుగుదొడ్ల కోసం ఇళ్లకు పరిగెత్తాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యతో విసిగిపోయిన విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. ఉపాధ్యాయురాలే స్కూలుకు తాళం వేసి, ఉన్న కొద్దిమంది విద్యార్థులను దూరంగా ఉన్న వేరే పాఠశాలకు తీసుకెళ్లి బోధన సాగిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఉపాధ్యాయులు కరువు.. బడుల తరలింపు

● యర్రవారిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకపోవడంతో, అక్కడ ఉన్న 10 మంది విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది.

● చాట్రాయి గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలలో ‘నాడు–నేడు’ కింద అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ ఉపాధ్యాయుడిని నియమించలేదు. దీంతో అక్కడి 12 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్లినా.. ఫీజులు కట్టలేక వెనక్కి వచ్చి, ప్రస్తుతం చాట్రాయి మెయిన్‌ స్కూలుకు వెళ్తున్నారు. పాఠశాలలో వసతులున్నా ఉపాధ్యాయుడిని నియమించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి.

● జగన్నాథపురం, టీ గుడిపాడు, నరసింహారావుపాలెం ప్రాథమిక పాఠశాలలు సైతం వివిధ కారణాలతో మూతపడటంతో చిన్నారులు చదువుకు దూరమవుతున్నారు.

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

మండలంలో ఇద్దరు ఎంఈవోలు ఉన్నప్పటికీ, పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికి ముందు ఉపాధ్యాయులు గ్రామాల్లో తిరిగి ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రచారం చేసేవారే కరువయ్యారని, అందుకే విద్యార్థులు ప్రైవేటు బాట పట్టడమో లేదా బడులకు దూరమవడమో జరుగుతోందని ప్రజలు మండిపడుతున్నారు.

పాఠశాల కావాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా అర్జీ అందిస్తే, పై అధికారులకు నివేదిక ఇచ్చి ఆ బడులను తిరిగి తెరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.

– మాసగిరి శ్రీనివాసరావు,ఎంఈవో 1, చాట్రాయి

చాట్రాయి మండలంలో అస్తవ్యస్తంగా ప్రాథమిక విద్య

అసంపూర్తిగా ‘నాడు–నేడు’ పనులు.. ఉపాధ్యాయులు లేక బడుల బంద్‌

ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement