దెందులూరు: ఆశ్రం ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ అరుదైన వైద్య సేవలతో ప్రాణాలు నిలబెట్టి మరో మైలురాయిని సాధించారు. అధిక ప్రమాదకర గర్భధారణ నేపథ్యంలో, ఓ తల్లికి ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో పాటు గర్భంలోని శిశువుకు రక్తప్రసరణ కూడా తగ్గింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 31 వారాలకే ముందస్తు ప్రసవం చేయాల్సి వచ్చింది. గైనకాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ వందన, పీడియాట్రిక్స్ హెచ్‌ఓడీ డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలోని వైద్య సిబ్బంది ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం ఆ శిశువును నియోనాటల్ ఐసీయూలో ఉంచి 61 రోజుల పాటు ప్రత్యేక వైద్య సేవలు అందించారు. సోమవారం నాటికి పాప ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడటంతో సంపూర్ణ ఆరోగ్యంతో తల్లి, శిశువును డిశ్చార్జ్ చేసినట్లు ఆశ్రం ఆసుపత్రి డైరెక్టర్ జి.రతీదేవి, సీఈఓ కె.హనుమంతరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేసిన డాక్టర్ వందన, డాక్టర్ వసుంధర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.


