ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకులు అందిస్తున్న రుణ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ (ట్రెజరీ) జి.భాస్కర్ సూచించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించిన వ్యవసాయ రుణాల అవుట్‌రీచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బ్యాంక్ ఆధ్వర్యంలో వివిధ రంగాల అభివృద్ధికి అందిస్తున్న సేవలను వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి రుణాల మంజూరు ప్రక్రియను సరళతరం చేశామన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ పి. శ్రీనివాసరావు విశిష్ట అతిథిగా హాజరుకాగా విజయవాడ రీజినల్ హెడ్ ఈ. వెంకటేశ్వరరావు, రీజినల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ జయ మహీధర్ రెడ్డి, ఏలూరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ దీపక్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం, అర్హులైన రైతులకు వ్యవసాయ రుణాలను మంజూరు చేసి పంపిణీ చేశారు.


