నూజివీడు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటనపై సబ్‌కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న సోమవారం ప్రాథమిక విచారణ నిర్వహించారు. మండలంలోని బోర్వంచకు చెందిన రామకూరి ప్రేమ్‌బాబు కడుపులో నొప్పితో ఆసుపత్రిలో చేరగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. సంబంధిత ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరుతూ మృతుడి బాబాయ్ రామకూరి రాజు సబ్ కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అర్జీని అందజేశారు. ఈ నేపథ్యంలో నూజివీడు ఏరియా ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మత్రూనాయక్, ఆర్‌ఎంవో డాక్టర్ వరప్రసాద్, సీనియర్ వైద్యులు శ్రీనివాస్ సబ్ కలెక్టర్‌ను కలసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి సంబంధిత సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపనున్నట్లు సబ్ కలెక్టర్ వినూత్న పేర్కొన్నారు.


