తణుకు అర్బన్: అనుభవజ్ఞులైన వైద్యులతో మూగజీవాలకు విశిష్ట సేవలందిస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన తణుకు పశు వైద్యశాల ప్రస్తుతం తీవ్ర సమస్యలతో కునారిల్లుతోంది. నిత్యం 80 ఓపీ, నెలకు 90 శస్త్రచికిత్సలు, 500 వరకు రక్తపరీక్షలు నిర్వహించే ఈ ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి సరైన నిధుల కేటాయింపులు లేవు. బడ్జెట్ 30 శాతానికి మించి లేకపోవడంతో దూది (కాటన్), సిరంజీలు, బ్లడ్ టెస్టింగ్ కిట్లు వంటి ప్రాథమిక వైద్య పరికరాలు కూడా కరువయ్యాయి. శస్త్రచికిత్సలకు అవసరమయ్యే గ్యాస్ మత్తుమెషీన్ అందుబాటులో లేకపోవడం తీవ్ర లోపంగా మారింది. మందులను ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యుల కొరత
మరోవైపు ఆసుపత్రిని వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల్లో ఇద్దరు ఉన్నప్పటికీ, ముగ్గురు పశువైద్యు లకు గాను ఒక్కరే పనిచేస్తున్నారు. ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్లు, నలుగురు ఆఫీస్ సబార్డినేటర్ పోస్టులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ ఒక్కరే అందుబాటులో ఉన్నారు. తీవ్ర పనిఒత్తిడి కారణంగా ఇక్కడికి బదిలీపై వచ్చేందుకు సిబ్బంది వెనుకాడుతుండగా, హౌస్ సర్జన్ల సాయంతోనే సేవలు అందిస్తున్నారు. ప్రసవ సమస్యలు, ఆర్థోపెడిక్ సర్జరీలు, కుక్కలకు చేసే సంక్లిష్ట శస్త్రచికిత్సల్లో ఈ వైద్యశాల ఎంతో పేరుగాంచింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని, పో స్టులను భర్తీ చేసి ఉచిత మందులు అందుబాటులోకి తేలాలని పాడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తణుకు వైద్యశాఖలో దూదీకి దిక్కులేదు
గతమెంతో ఘనం.. ప్రస్తుతం నిర్వీర్యం
వైద్యులు, సిబ్బంది కొరత


