న్యూస్‌రీల్
మరో 15 రోజుల్లో నాట్లు పూర్తి
శివారు భూములకు ఆయిల్ ఇంజిన్లే దిక్కు
గురువారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2026
భీమవరం: జిల్లా వ్యాప్తంగా గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా సార్వా వరినాట్లు ఊపందుకున్నాయి. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 2.25 లక్షల ఎకరాల్లో సార్వా పంటకు నాట్లు వేయాల్సి ఉండగా ఇంత వరకు సుమారు 1.60 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తిచేశారు. గత దాళ్వా సీజన్‌లో వరి పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈ సారి ఉత్సాహంతో సార్వా సాగుకు ఉపక్రమించారు. అయితే విస్తారంగా వర్షాలు కురవాల్సిన జూన్, జూలై నెలల్లో వరుణుడి జాడ లేకపోవడంతో కాలువ నీటిపైనే సాగుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాలువ శివారు ప్రాంతాలకు సాగునీరు సక్రమంగా అందక నాట్లు మందకొడిగా సాగుతున్నాయి. జూలైలో ఇంతవరకు సరాసరి 230 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సివుండగా ఇంతవరకు కేవలం 63 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈనెల 27, 28 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా సరాసరి సుమారు 50 మిల్లీ మీటర్ల వర్షం కురవడంతో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి.
బెంగాలీ నాట్లకు డిమాండ్
వర్షాలు లేకపోవడంతో ఆలస్యంగా వరినారు వేసిన రైతులు త్వరితగతిన నాట్లు పూర్తిచేయడానికి బెంగాలీ నాట్ల పట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. నారుమడి వేసిన 20 రోజుల లోపు బెంగాలీ విధానంలో నాట్లు వేయడానికి అవకాశమున్నందున బెంగాలీ కూలీలను తీసుకువచ్చి నాట్లు వేయిస్తున్నారు. తక్కువ రోజుల నారుతో నాట్లు వేయడమే గాక త్వరితగతిని నాట్లు వేస్తుండడంతో బెంగాలీ కూలీలను ఆశ్రయిస్తున్నారు. బెంగాలీ కూలీలు నారు తీయడం, నాట్లు వేసేందుకు ఎకరాకు రూ.3,500 తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు.
గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 1.60 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తిచేశారు. మరో 15 రోజుల్లో వరి నాట్లు దాదాపు పూర్తవుతాయి. నాట్లు వేసిన భూముల్లో తగినంత నీరు ఉండేలా రైతులు చర్యలు తీసుకోవాలి.
– జెడ్.వెంకటేశ్వరరావు,
జిల్లా వ్యవసాయశాఖాధికారి, భీమవరం
గత నాలుగు రోజులుగా వర్షాలతో జోరుగా పనులు
జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి
మరో 15 రోజుల్లో నాట్లు పూర్తవుతాయంటున్న అధికారులు
కాలువ శివారు భూములకు ఆయిల్ ఇంజిన్లే దిక్కు
రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నా అనేక మండలాల్లోని కాలువ శివారు భూములకు సాగునీరందకపోవడంతో అనేక మంది రైతులు ఆయిల్ ఇంజిన్లను ఉపయోగించుకుని బోరునీటితో సాగుచేస్తున్నారు. మరికొంతమంది రైతులు కాలువలో నీరు మెరక భూములకు చేరకపోవడంతో బోదుల్లో ఆయిల్ ఇంజిన్లు వేసుకుని నీటిని తోడుకుంటున్నారు. ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లోని రైతులు ఒక విడత ఎరువులు వేసుకుని కలుపు తీతలు కూడా పూర్తిచేసుకున్నారు. ఇలాంటి తరుణంలో కురుస్తున్న వర్షాలు పైరుకు మేలు చేస్తాయని చెబుతున్నారు. అయితే చేలలో తగినంత నీరులేకపోవడంతో కలుపు పెరిగిపోతుందని అందువల్ల కూలీలకు ఎక్కువ ఖర్చుచేయాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


