ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన మాధవ కల్యాణ మండపంలో బుధవారం శ్రీమన్నారాయణీయం సామూహిక గళార్చన వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 1,500 మంది భక్తులు పాల్గొని, నారాయణీయం శ్లోకాలను చదివారు. దాంతో క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నారాయణ భట్టాద్రి గురువాయూరు శ్రీకృష్ణునిపై భక్తితో రచించిన మహిమాన్విత గ్రంథం నారాయణీయమని తెలిపారు. ఇందులో 100 దశకాలు, 1,036 శ్లోకాలు ఉన్నాయని, అస్మిన్ పరాత్మన్ పారాయణానికి ఆరోగ్యప్రదమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని పేర్కొన్నారు. పెద్ద తిరుపతి, భద్రాచలం, హైదరాబాద్ తదితర క్షేత్రాల్లో కూడా పారాయణాలు నిర్వహించామని, ఇవన్నీ పూర్తిగా సభ్యుల సొంత ఖర్చులతోనే నిర్వహిస్తున్నామని, దేవస్థానాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.


