కొల్లేరుకు వస్తా.. చర్చకు సిద్ధమా? | - | Sakshi
Sakshi News home page

కొల్లేరుకు వస్తా.. చర్చకు సిద్ధమా?

Jul 30 2026 1:03 AM | Updated on Jul 30 2026 1:03 AM

చింతమనేనికి అబ్బయ్య చౌదరి సవాల్‌

దెందులూరు: ‘నేను కొల్లేరు శ్రీపర్రు గ్రామానికి వస్తాను... చర్చకు నువ్వు సిద్ధమా? ఎప్పుడు వస్తావో, ఎక్కడికి వస్తావో టైమ్‌ ఫిక్స్‌ చెయ్‌’ అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సవాల్‌ విసిరారు. బుధవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. పదే పదే కొల్లేరు ప్రజలను తనపై ఉసిగొల్పుతున్నారని.. తన ఇంటి వద్ద ధర్నాలు చేయించడమే కాకుండా, రెండేళ్లుగా తన పొలంలో పంట కోయనివ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఏదైనా ఉంటే నేరుగా తనతో రాజకీయం చేయాలని, తన కుటుంబ సభ్యులతో, పొలాలతో కాదని.. ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగింది? ఎవరికి మేలు జరిగిందో కొల్లేరు శ్రీపర్రులో ముఖాముఖి చర్చిద్దామని సవాలు విసిరారు. చింతమనేని సొంత గ్రామమైన దుగ్గిరాలలో పాఠశాల, సచివాలయం కట్టింది కూడా తన హయాంలోనేనని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దెందులూరులో మాత్రమే కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, గతంలో తాను, ఇప్పుడు చింతమనేని గెలిచారని గుర్తుచేశారు. జగన్మోహన్‌ రెడ్డి పాలనలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. నేటి కూటమి ప్రభుత్వం రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు.

పోలీసుల తీరుపై మండిపాటు

పోలీసులు, రెవెన్యూ అధికారులు తమ విధులను విస్మరించి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన ఇంటి వద్ద సమీక్ష సమావేశం నిర్వహిస్తే 190 మందికి నోటీసులు ఇచ్చారని, ప్రతిపక్షానికి సమావేశం ఏర్పాటు చేసుకునే హక్కు లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే లేని ఆంక్షలు వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఎందుకని నిలదీశారు. అధికారులకు సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 మధ్య తేడా కూడా తెలియడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై చట్టపరంగా పోరాడతామని హెచ్చరించారు. అబ్బయ్య చౌదరిపై దాడి చేస్తే నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడతారని.. పార్టీ బలహీన పడుతుందని అనుకుంటే పొరపడినట్లేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement