తణుకు అర్బన్: ‘నిద్దరోతున్న నిఘా నేత్రాలు’ శీర్షికన సాక్షి దినపత్రికలో ఈనెల 28వ తేదీన ప్రచురితమైన కథనానికి తణుకు పట్టణ సీఐ జేవీ రమణ స్పందించారు. రాష్ట్రపతి రోడ్డుతోపాటు, పలు ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను సాంకేతిక సిబ్బంది ద్వారా తనిఖీ చేయించి మరమ్మతులు చేయించారు. అధిక శాతం సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకువచ్చామని, మిగిలినవి కూడా త్వరలోనే పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీఐ తీసుకున్న ఈ సత్వర చర్యపట్ల తణుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపును దక్కించుకుంది. గ్రీన్ మెంటార్స్ సంస్థ నిర్వహించిన ‘నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (ఎన్‌జీయూఆర్) –2026’లో దేశంలోనే 16వ ర్యాంక్‌ను సాధించి, గోల్డ్ రేటింగ్ కై వసం చేసుకుంది. పర్యావరణ నిర్వహణ, సౌరశక్తి ఉపయోగం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను కేటాయించారు. ఈ జాతీయ గుర్తింపుతో పాటు, అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే 10వ ‘ఎన్‌వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్–2026’ సదస్సులో పురస్కారం అందుకోవడానికి విశ్వవిద్యాలయానికి ప్రత్యేక ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా వీసీ డాక్టర్ ధనుంజయరావు మాట్లాడుతూ.. పర్యావరణ సంరక్షణను మేళవించడంలో వర్సిటీ ఆదర్శంగా నిలిచిందని, రైతుల సంక్షేమానికి, సమగ్ర సేవలు అందించడానికి ఈ పురస్కారం నిరంతర స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ విజయం సాధించిన అధికారులను, సిబ్బందిని, విద్యార్థులను ఆయన అభినందించారు.
భీమవరం: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షకు హాజరయ్యే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. ప్రకాశం, బీవీ నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పిస్తున్న విధంగానే, ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగే టెట్ పరీక్షకు హాజరయ్యే ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలన్నారు. టెట్ దరఖాస్తు చేసుకునే సమయంలో ఎడిట్ ఆప్షన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల హాల్‌టికెట్లు రాని ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించి, వారికి హాల్‌టికెట్లు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం, నారాయణ విజ్ఞప్తి చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో నరసాపురం నియోజకవర్గంలో మొదటి ప్రత్యేక పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని ఈనెల 31వ తేదీ ఉదయం 9.30 గంటలకు నరసాపురం మునిసిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఒక నెల–ఒక నియోజకవర్గం –నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిలకు చెందిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు. నరసాపురం నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


