విజ్ఞాన్‌ మంథన్‌.. ప్రతిభాన్వేషణ్‌ | - | Sakshi
Sakshi News home page

విజ్ఞాన్‌ మంథన్‌.. ప్రతిభాన్వేషణ్‌

Jul 15 2026 12:58 AM | Updated on Jul 15 2026 12:58 AM

ఇస్రో వంటి సంస్థల్లో శిక్షణ

జిల్లాలో 2 వేల మంది విద్యార్థులు

విద్యార్థులకు కేంద్రం ప్రోత్సాహకాలు

వీవీఎం పేరుతో డిజిటల్‌ టాలెంట్‌ టెస్ట్‌

ఇస్రో వంటి సంస్థల్లో శిక్షణకు అవకాశం

సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

నిడమర్రు: విద్యార్థుల్లో దాగి ఉన్న విజ్ఞానాన్ని వెలికితీసేందుకు, వారిని పరిశోధన, ప్రయోగ రంగాల వైపు మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా దేశంలోనే అతిపెద్ద డిజిటల్‌ సైన్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్షను ‘విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌’ (వీవీఎం) పేరుతో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. ప్రభుత్వ పరిధిలోని విజ్ఞాన భారతి, ఎన్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన సంగ్రహాలయాల మండలి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ జాతీయ స్థాయి ప్రతిభా అన్వేషణ పరీక్షను నిర్వహిస్తున్నాయి. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులు సెప్టెంబర్‌ 30వ తేదీ వరకూ వీవీఎం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. 6 నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వరకూ నవంబరు 16 నుంచి 21వ తేదీ వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. గత విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 52 పాఠశాలలు ప్రాతినిధ్యం చేయగా 520 మంది వరకూ ఈ పరీక్ష రాసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రైవేటు విద్యార్థులకూ..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాలు కలపి 1152 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం వీవీఎం ప్రతిభ పరీక్షలకు ప్రభుత్వంతోపాటు ప్రైవేటు విద్యార్థుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రూ.200 రుసుం చెల్లించి విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. పాఠశాల ద్వారా అయితే రూ.170 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు.

నగదు బహుమతులు ఇలా

పాఠశాల, జిల్లా స్థాయిలో విజేతలైతే ప్రశంసాపత్రం ఇస్తారు. రాష్ట్రస్థాయిలో విజేతలైతే ధ్రువపత్రంతోపాటు జ్ఞాపిక ఇస్తారు. ప్రతిభ చూపిన ముగ్గురికి రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున నగదు ఇస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపితే రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు చొప్పున నగదు బహుమతి ఇస్తారు. భాస్కర స్కాలర్‌ షిప్‌ పేరుతో ఏడాదిపాటు నెలకు రూ.2 వేలు చొప్పున ఉపకార వేతనాలతో దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలను సందర్శించే అవకాశం కల్పిస్తారు.

100 ప్రశ్నలు–100 మార్కులు

1.30 గంటల్లో 100 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. సెక్షన్‌–ఎ లో 40 ప్రశ్నలకు ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు. సెక్షన్‌–బిలో 50 ప్రశ్నలు సైన్స్‌, గణితం పాఠపుస్తకాల్లోని అంశాలు. వీవీఎం వారు అందించే స్టడీ మెటీరియల్‌ ద్వారా ఈ ప్రశ్నలు ఉంటాయి. లాజిక్‌, రీజనింగ్‌కు సంబంధించి 10 శాతం ప్రశ్నలుంటాయి. వీటిని సమకాలీన అంశాలపై ఇస్తారు. బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రతి తరగతి నుంచి ఎంపికై న టాప్‌–25 మంది విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీలో రాణించేందుకు రాష్ట్రస్థాయి శిబిరంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

ఈ వీవీఎం ఆన్‌లైన్‌ టెస్ట్‌లో గత 7 ఏళ్లలో పశ్చిమ విద్యార్థులు 5సార్లు స్టేట్‌ లెవిల్‌ వరకూ వెళ్లారు. ఎంపికై న వారు విద్యార్థి దశలోనే శ్రీజన్‌ ఇంటర్న్‌షిప్‌ ద్వారా ఇస్రో, డీఆర్‌డీఓ, సీఎస్‌ఐర్‌, ఐఐటీ, నిట్‌ వంటి ప్రముఖ పరిశోధనా సంస్థల్లో శిక్షణ పొందవచ్చు.

– ఏసీవీ ప్రకాష్‌, వీవీఎం, స్టేట్‌ అకడమిక్‌ కో–ఆర్డినేటర్‌

గత ఏడాది పశ్చిమగోదావరి జిల్లా నుంచి 16 మంది స్టేట్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది 2 వేల మందికి పైగా విద్యార్థులను ఈ వీవీఎం టాలెంట్‌ పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా కృషి చేస్తున్నాం. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారంతోపాటు బ్రోచర్స్‌, పోస్టర్స్‌ పాఠశాలలకు అందిస్తున్నాము.

– రేపాక వెంకన్నబాబు, జిల్లా కో–ఆర్డినేటర్‌, వీవీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement