నూజివీడు: మండలంలోని పలు చెరువుల్లో అధికార పార్టీ నేతలు మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడి ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. వ్యవసాయ భూములకు పూడిక మట్టిని తోలుకుంటున్నామంటూ కొన్ని చోట్ల అనుమతులు తీసుకొని బయటకు విక్రయిస్తున్నారు. అక్రమ తవ్వకాలను, తోలకాలను నిరోధించాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిగా చేతులెత్తేయడంతో తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత చందంగా పరిస్థితి తయారైంది. బోర్వంచలోని ఊరచెరువు, దిగవల్లిలోని ఎర్ర చెరువు నుంచి, దేవరగుంటల్లో యథేచ్ఛగా మట్టి తవ్వి బయటకు తరలించి విక్రయిస్తున్నారు. గత ప్రభుత్వంలో చెరువులో నుంచి ట్రక్కు మట్టిని తవ్వుకోవాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అదేమీ లేకుండా యథేచ్ఛగా ప్రజలకు చెందిన సహజ వనరులను దోచుకుంటున్నా సంబంధిత అధికారులు స్పందించకుండా మిన్నకుంటున్నారు. చెరువుల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు మాత్రం అటువైపే కన్నెత్తి చూడటం లేదు. బోర్వంచ చెరువులో నుంచి మట్టిని తరలించి పట్టణంలో విక్రయిస్తున్నారు. వర్షాలు పడకపోవడం, చెరువులు నిండకపోవడంతో టీడీపీ నాయకులకు మట్టిని అమ్ముకోవడానికి మంచి అవకాశం లభించిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. చట్టాలను, నిబంధనలను సక్రమంగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం చేష్టలుడిగి చోద్యం చూస్తుండటంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు
నిబంధనలను పట్టించుకోకుండా అడ్డగోలు తవ్వకాలు చేస్తుండడంతో చెరువుల రూపురేఖలే మారిపోతున్నాయి. పూడిక మట్టిని ఒక మీటరు మించి లోతు తవ్వడానికి వీల్లేదు. నీళ్లు పొలాలకు వెళ్లేందుకు తూము లెవెల్ కంటే ఇంకా దిగువకు తవ్వుతున్నారు. అలాగే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పూడికను తొలగించాలి. తొలగించిన పూడిక మట్టిని సైతం ఏ సర్వే నెంబరు భూమిలోకి తోలుకుంటామని అనుమతిని తీసుకున్నారో అందులోకే తోలాలి. ఇవేమీ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు తోలి దోపిడీ చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం.
చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం


