పెనుగొండ: జీవనోపాఽధి కోసం మస్కట్‌కు వెళ్లిన ఇలపర్రువాసి సరేళ్ల విజయ్‌కుమార్ (47) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయ్‌కుమార్ ఆరు నెలల క్రితం జీవనోపాధి కోసం అప్పు చేసి మస్కట్ వెళ్లారు. ఈ క్రమంలో జూన్ 30వ తేదీన కంపెనీ నుంచి జీతం తీసుకొని, స్వదేశంలోని కుటుంబ సభ్యులకు పంపడానికి వెళుతుండగా వాహనం ఢీకొని తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ ఈనెల 9న మృతి చెందినట్లు బందువులు తెలిపారు. అతడి మృతదేహం బుధవారం ఉదయానికి ఇలపర్రు చేరుకుటుంటుందని చెప్పారు. విజయ్‌కుమార్‌కి భార్య బేబీ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహం కాగా, మరో ఇద్దరికి వివాహం చేయాల్సి ఉంది. విజయ్‌కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆగిరిపల్లి: సింహాద్రి అప్పారావుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వంట గదిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం పాఠశాలలో వంట ఏజెన్సీ సిబ్బంది విద్యార్థులకు భోజనం తయారు చేయడానికి గ్యాస్ పొయ్యి వద్ద లైటర్‌తో వెలిగించగా గ్యాస్ పైప్ లీక్ అయ్యి వంట గదిలో భారీ మంటలు ఎగిసి పడి వంటగదిలోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. ప్రమాదాన్ని గమనించిన ఉపాధ్యాయులు విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మాజీ సర్పంచ్ సాగర్, గ్రామస్తుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గ్యాస్ పైపు మార్చకుండా నిర్లక్ష్యం వహించడం వలన ప్రమాదం సంభవించిందని, ఇకనైనా జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.


