నూజివీడు: మండలంలోని పోతురెడ్డిపల్లిలో అక్కినేని ప్రసాద్ అనే రైతుకు చెందిన ఆయిల్పామ్ఏ తోట మంగళవారం దగ్ధమైంది. తోట మధ్యలో నుంచి 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్తుండగా మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో తీగ తెగి కింద పడటంతో ఒక్కసారిగా తోటలో ఉన్న ఎండుగడ్డికి మంటలు చెలరేగి క్షణాల్లో తోటంతా వ్యాపించాయి. దీంతో తోటలో ఐదెకరాల్లో ఉన్న బిందుసేద్యం పైపులు, పరికరాలు దగ్ధమయ్యాయి. అలాగే 100 ఆయిల్‌పామ్ చెట్ల మొదళ్లు కాలాయి. రైతులందరూ హుటాహుటిన బోర్లు వదిలి నీటితో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న నూజివీడు ఫైర్ సిబ్బంది తోట వద్దకు వచ్చి మంటలను అదుపు చేశారు. దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు అక్కినేని ప్రసాద్ వాపోయాడు.
భీమవరం: పట్టణంలో వర్థమాన నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జైకృష్ణ సందడి చేశారు. ఆయన హీరోగా నటించిన శ్రీనివాస మంగాపురం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం చిత్ర యూనిట్‌తో కలిసి భీమవరం వచ్చారు. ముందుగా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రాయప్రోలు శ్రీనివాసమూర్తి నివాసం నుంచి మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం వరకు అభిమానులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఎడ్వర్ట్ ట్యాంక్‌వద్ద గల సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం త్యాగరాజ భవనంలో ఏర్పాటు చేసిన అభిమానుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురం చిత్రం ప్రేక్షకుల ఆదరణతో సూపర్ హిట్‌గా నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. రాయప్రోలు శ్రీనివాసమూర్తి, బీహెచ్ సుబ్బరాజు, రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి పాల్గొన్నారు.
స్నేహితులతో సత్యదేవుని దర్శనానికి వచ్చి ఘటన
అన్నవరం: స్నేహితులతో కలిసి స్థానిక పంపా నదిలో స్నానం చేయడానికి వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి కె.బాల సాత్విక్ (21) నీటిలో మునిగి మృతి చెందాడు. ఏలూరుకు చెందిన బాలసాత్విక్ భీమవరంలోని డీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సవరం చదువుతున్నాడు. సోమవారం స్థానిక గ్రామదేవత మరిడమ్మ జాతరకు స్నేహితులతో కలసి అన్నవరం వచ్చాడు. రాత్రి జాతరలో పాల్గొని మంగళవారం స్నేహితులతో కలిసి సత్యదేవుని దర్శించి అనంతర పంపాలో స్నానాల ఘాట్ వద్ద స్నేహితులతో కలసి స్నానం చేస్తూ మునిగిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వారిచ్చిన సమచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందిని పిలిపించారు. వారు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భీమవరంలో విషాదఛాయలు
భీమవరం: పట్టణంలోని డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ ఏఐఎంఎల్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతితో విషాదం నెలకొంది. ఏలూరు జిల్లా చాటపర్రుకు చెందిన బి.సాత్విక్ భీమవరంలో గదిని అద్దెకు తీసుకుని చదువుకుంటున్నాడని స్నేహితులు తెలిపారు. తోటి విద్యార్థితో అన్నవరం సమీపంలోని ఓ గ్రామంలో జరిగే ఉత్సవాలకు రెండురోజుల కిందట వెళ్లాడని, అక్కడ పంపా నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదం జరిగిందని మిత్రులు వాపోయారు.
ముదినేపల్లి(కై కలూరు): అప్పులు తీర్చలేక గడ్డి మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. ముదినేపల్లి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వణుదుర్రు గ్రామానికి చెందిన భూపతి శ్యాంకుమార్ (34) పొద్దువాకలో బొంగులూరు పుల్లయ్య చేపల చెరువుపై పనిచేస్తున్నాడు. దాదాపు 6 నెలల క్రితం కొత్త ఇంటి నిర్మాణానికి, తన అరోగ్యం కోసం యజమాని నుంచి అప్పు తీసుకున్నాడు. దానిని పూర్తిగా చెల్లించలేక ఈ నెల 4న చెరువు వద్ద గడ్డి మందును తాగేశాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు చెప్పారు. ముదినేపల్లి, గుడివాడ, మచిలీపట్నం, విజయవాడలో చికిత్స పొందుతూ అతను మరణించాడు, భార్య వెన్నెల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


