భీమవరం: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై అంగన్‌వాడీలు భగ్గుమన్నారు. కూటమి ప్రభుత్వ దుశ్చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్‌లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ సమస్యల సాధన కోసం ఆందోళన చేస్తున్న మహిళలను తెల్లవారుజామున శిబిరంలో విద్యుత్ నిలుపుదల చేసి మరీ అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. వారందరినీ సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు జీతాలు పెంపుపై మాట్లాడకపోగా అంగన్‌వాడీలపై ఇలాంటి దశ్చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు, అంగన్‌వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి కళ్యాణి మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి పెద్దింట్లు, మాధవి రాజకుమారి, శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు.


