నష్టాలు తప్పేలా లేవు
చింతలపూడి: గతంలో మెట్ట రైతులకు కోట్లాది రూపాయల రాబడిని ఆర్జించి పెట్టిన జీడి మామిడి తోటలు నానాటికి అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా ఒక ఏడాది లాభాలు వస్తే రెండేళ్లు నష్టాలను చవిచూస్తున్నారు మెట్ట రైతులు. దీంతో గత పదేళ్లుగా జీడి తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించారు. ముఖ్యంగా పామాయిల్, మొక్కజొన్న, వేరుశనగ, అరటి పంటలను ఎక్కువగా పండిస్తున్నారు. అదీగాక మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాల వినియోగం పెరిగాక వాణిజ్య పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. చింతలపూడి సబ్ డివిజన్‌లో ఒకప్పుడు వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న జీడి తోటలు ప్రస్తుతం 2 వేల హెక్టార్లకు చేరుకున్నాయి. గతేడాది జీడి పిక్కల బస్తా(100 కేజీలు) రూ.12 వేల వరకు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. జీడి తోటల పెంపకం వల్ల రైతులకు రకరకాలుగా ఆదాయం లభిస్తుంది. మన ప్రాంతంలో రైతులు జీడి పిక్కలను మాత్రమే సేకరిస్తారు. జీడి పండ్లను చెట్ల కిందే వదిలేస్తారు. అదే ఇతర రాష్ట్రాల్లో అయితే అక్కడి రైతులు పండ్లను కూడా సేకరించి ఆదాయం పొందుతున్నారు. వీటితో జామ్, పండ్ల రసాలు, తయారు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. విదేశీ ఎగుమతులపై ఇక్కడి రైతులకు దృష్టి లేదు. ఏటా ఇక్కడి నుంచి కమీషన్ దారులు లారీల్లో జీడి పిక్కలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న తోటలను కాపాడుకోవడంతో పాటు కొత్తగా తోటలు వేసుకునే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ ఏడాది మార్కెట్లో జీడి పిక్కల ధర ఆశాజనకంగానే ఉంటుందని భావిస్తున్నాం. గత రెండు నెలలుగా కురుస్తున్న విపరీతమైన మంచు కారణంగా పూత మాడిపోయే ప్రమాదం ఏర్పడింది. దిగుబడి కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతో నష్టాలు తప్పేలా లేవు.
– ఎస్‌కే అహ్మద్, కమలాపురం


