గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల జిల్లా ప్రజలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. నాలుగు నెలల క్రితం భీమవరానికి చెందిన ఓ వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని డిజటల్ అరెస్టు పేరిట రూ.99 లక్షలు మోసగించారు. ఆకివీడుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలిని ఆధార్ కార్డు దుర్వినియోగం జరిగిందని, ఉన్నత స్థాయి పోలీసు అధికారులమని చెప్పి ఆమె నుంచి రూ.93.25 లక్షలు కాజేశారు. జిల్లాలోని మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్‌ను సైబర్ నేరస్తులు ముఠా ఏసీబీ అధికారులమని నమ్మించి భయపెట్టి సొమ్ము కాజేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల నేరాల తీవ్రత పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంతమైన వాతావరణం కాపాడేలా ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణకు పశ్చిమ పోలీసులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది.


