బాలలు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

బాలలు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి

Mar 4 2026 8:22 AM | Updated on Mar 4 2026 8:22 AM

బాలలు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ఆకివీడు సీఐ సస్పెన్షన్‌ 8న జిల్లాస్థాయి రకీడాపోటీలు కొత్త ఆవిష్కరణలు రావాలి

ఏలూరు (టూటౌన్‌): బాలలు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్‌ కోరారు. స్థానిక ఆదిత్య సెంట్రల్‌ నందు చైల్డ్‌ రైట్స్‌ అడ్వకసీ ఫౌండేషన్‌ – క్రాఫ్‌ ఆధ్వర్యంలో బాలలతో ముఖాముఖి కార్యక్రమంను బుధవారం నిర్వహించారు. క్రాఫ్‌ స్టేట్‌ మోనటరింగ్‌ కోఆర్డినేటర్‌ సీహెచ్‌ ప్రభాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రత్నప్రసాద్‌ మాట్లాడారు. నేటి సమాజంలో బాలలపై అనేక రకాల వివక్ష, వేధింపులు, బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణా జరుగుతున్నాయని, వీటి గురించి గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. బాలలు ఇబ్బందుల్లో ఉంటే హెల్ప్‌ లైన్‌ నెంబర్స్‌ 1098, 112, డయల్‌ పోలీస్‌ 100, మహిళ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 181, న్యాయ సలహాల కోసం 15100 వంటి ఉచిత నెంబర్లకు ఫోన్‌ చేసి సలహాలు కోరవచ్చని బాలలకు సూచించారు. కార్యక్రమంలో ఏలూరు మహిళ పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ యు రవిచంద్ర, ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఎం.సుబ్బారావు, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ పి వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్‌ నోడల్‌ అధికారి టి.తులసి తదితరులు పాల్గొన్నారు.

ఆకివీడు: ఐజీ ఆదేశాల మేరకు ఆకివీడు రూరల్‌ సీఐ జగదీశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ నయీం అస్మీ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బాలికపై అత్యాచారయత్నం కేసులో ముద్దాయిపై సరైన చర్యలు తీసుకోలేదని, గతంలో అదే వ్యక్తి ఓ హత్యకు సంబంధించిన కేసులో బెయిల్‌పై రావడం వంటి ఘటనల్లో కూడా సీఐ జగదీశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో సస్సెండ్‌ చేసినట్లు తెలిసింది. ఆయన స్థానంలో ఇన్‌చార్జిగా ఇంకా ఎవరినీ నియమించలేదు.

భీమవరం: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన భీమవరం డీఎన్నార్‌ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి టెన్నీస్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎన్‌ మోహన్‌దాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్నీస్‌ పోటీలు 40 ఏళ్లు వయస్సు పైబడిన పురుషులు, మహిళలకు సింగిల్స్‌, డబుల్స్‌లోను, బ్యాడ్మింటన్‌లో 35 ఏళ్లు వయస్సు పైబడిన పురుషులు, మహిళలకు సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 22, 23 తేదీల్లో విజయనగరంలో నిర్వహించే రాష్ట్రస్థాయి టెన్నీస్‌, 14, 15 తేదీల్లో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో నిర్వహించే బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తప్పనిసరిగా రాష్ట్ర క్రీడాప్రాధికర సంస్థ వెబ్‌సైట్‌లో నమోదుకావాలని స్పష్టం చేశారు. వివరాలకు 96405 03679లో సంప్రదించాలని సూచించారు.

తాడేపల్లిగూడెం: కొత్త ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని జియోస్పేషియల్‌ నిపుణుడు రామమూర్తి పిలుపునిచ్చారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దేశాభివృద్ధిలో జియో స్పేషియల్‌ సాంకేతికత పాత్ర అంశంపై అవగాహన కార్య క్రమం జరిగింది. ప్రముఖ జియో స్పేషియల్‌, కార్డోగ్రఫీ నిపుణుడు డాక్టర్‌ విష్ణువర్జుల ఎస్‌వి.ఎస్‌.ఎస్‌. రామమూర్తి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికత రంగాల్లో యువ ఇంజనీర్లు , పరిశోధకులు కొత్త ఆవిష్కరణల రూపకల్పనకు కృషి చేయాలని కోరారు. వరదలు, తుపానులు, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో ఉపగ్రహ డేటా వినియోగం ప్రాముఖ్యత ఉదాహరణలతో తెలిపారు. చంద్రయాన్‌–3 విజయాన్ని ప్రస్తావిస్తూ భారత అంతరిక్ష రంగంలో ప్రపంచ స్థాయిలో సాధించిన గౌరవాన్ని గుర్తు చేశారు. కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ కార్తికేయశర్మ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ జి.సంతోష్‌ కుమార్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement