నేరాలు.. ఖాకీలకు సవాల్‌ | - | Sakshi
Sakshi News home page

నేరాలు.. ఖాకీలకు సవాల్‌

Mar 4 2026 8:22 AM | Updated on Mar 4 2026 8:22 AM

ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల నేరాల తీవ్రత పెరుగుతోంది. రౌడీషీటర్లు కత్తులతో స్వైరవిహారం చేస్తున్నారు. అలాగే సైబర్‌ నేరాలు పెరగడంతో పాటు దోపిడీ కేసులు కూడా పెరిగాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంత వాతావరణం కాస్తా ప్రజలు ఆందోళన చెందే పరిస్థితికి చేరింది. కొత్తగా ఏర్పడిన జిల్లా కావడంతో గతంతో పోల్చుకుంటే పోలీసుల సేవలు ప్రజలకు మరింతగా అందుబాటులోకి వచ్చినా జిల్లాలో నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

భీమవరం(ప్రకాశం చౌక్‌): జిల్లాలోని కొందరు రౌడీషీటర్లు పోలీసులు ఇస్తున్న కౌన్సెలింగ్‌, పీడి యాక్ట్‌ ప్రయోగాన్ని లెక్కచేయడం లేదు. జైలుకు వెళ్లినా పర్వాలేదన్నట్లుగా నేరాలకు పాల్పడుతున్నారు. కేసులు, జైలు శిక్షలకు భయపడడం లేదు. నేరాలే లక్ష్యం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కొందరు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారు. కొందరు హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతుంటే.. మరికొందరు బెదిరింపులు, సెటిల్‌మెంట్‌ దందాలు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం జిల్లా కేంద్రమైన భీమవరంలో కోర్టు సమీపంలో ఓ రౌడీ షీటర్‌ను మరో రౌడీషీటర్‌ గ్యాంగ్‌ కారుతో గుద్ది కత్తులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ రోజు రౌడీషీటర్ల మధ్య గ్యాంగ్‌వార్‌ నడిచింది. కత్తులతో స్వైరవిహారం చేశారు. దాంతో భీమవరం ప్రజలు ఆందోళన చెందారు. పట్టపగలే జరిగిన ఈ సంఘటన చూస్తే పోలీసు కౌన్సెలింగ్‌ ఏ మాత్రం సరిపోవడం లేదని తెలుస్తోంది.

తీరు మార్చుకోని రౌడీషీటర్లు

విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లో గ్యాంగ్‌వార్‌లు, హత్యలు, హత్యాయత్నాలు చూస్తుంటాం. అలాంటిది ప్రశాంతంగా ఉండే భీమవరంలో గ్యాంగ్‌వార్‌ ఆందోళన రేకెత్తించింది. మొన్న తణకులో ఓ రౌడీషీటర్‌ దాడులు, బెదిరింపులకు పాల్పడడంతో పీడీ యాక్ట్‌ పెట్టి జైలుకు పంపించారు. ఆరు నెలల క్రితం ఉండి పరిసర ప్రాంతాల్లో హింసాత్మక దాడులు, బెదిరింపులు, హత్యాయత్నాలు చేస్తున్న ఇద్దరు రౌడీషీటర్లపై కూడా పీడి యాక్ట్‌ పెట్టి జైలుకు పంపారు. పల్లెల్లో కూడా రౌడీషీటర్ల దందాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. పోలీసులు కౌన్సెలింగ్‌ చేయడంతో పాటు అవసరమైతే అరెస్టులు చేస్తున్నా.. కొందరు రౌడీషీటర్లు వారి తీరు మార్చుకోవడం లేదు. కేసులు లెక్కచేయకపోవడం, రౌడీషీట్‌ ఉన్నా పోలీసులకే సవాలు విసురుతున్నట్లు ప్రవర్తిస్తున్నారు.

భీమవరంలో రౌడీషీటర్ల గ్యాంగ్‌వార్‌

పట్టపగలే హత్యకు మరో గ్యాంగ్‌ ప్రయత్నం

దోపిడీలు, సైబర్‌ నేరాలతో జిల్లా ప్రజల్లో ఆందోళన

కొత్త జిల్లాగా ఏర్పడినా తగ్గని నేరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement