నేత్రపర్వం.. ధ్వజారోహణం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన శ్రీ వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి ఆలయంలో ధ్వజారోహణ వేడుక నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు, పండితులు గర్భాలయంలో కొలువైన స్వామికి విశేష అభిషేకాలను నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. ఆ తరువాత ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి పండితులు, అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపనను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు.


