పేదల ఇళ్లపై స్మార్ట్ పిడుగు
పేదలపై భారం
● జగనన్న కాలనీలో ఇళ్లకు స్మార్ట్ మీటర్ల బిగింపు
● ఆందోళనలో లబ్ధిదారులు
ఆకివీడు: పేదలపై కక్ష సాధింపుల్లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం ఇళ్లకు స్మార్ట్ (అదానీ) మీటర్లు బిగిస్తోంది. ఏళ్ల తరబడి పూరిళ్లలో కాలం గడిపిన తమకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి సహకరించారని, కనీసం బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్న తమకు ప్రస్తుత చంద్రబాబు సర్కారు స్టార్ట్ మీటర్ల భారం మోపుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. స్టార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ సరఫరా కోసం ముందుగానే రీచార్జి చేసుకోవాల్సి వస్తుందని ఇది తమకు భారమని అంటున్నారు. ఆకివీడు మండలంలోని కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని జగనన్న కాలనీలో గత ప్రభుత్వంలో 3,600 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. వారిలో సుమారు 1,600 మంది నిర్మాణాలు పూర్తిచేసి గృహ ప్రవేశా లు కూడా చేశారు. మరో 1,000 మందికి పైగా లబ్ధిదారులు పునాది వరకు నిర్మించుకుని చంద్రబాబు ప్రభుత్వంలో రూ.4 లక్షల సాయం ఇస్తారనే హామీ ని నెరవేరుస్తారని ఎదురుచూస్తున్నారు. ఈ తరు ణంలో ఇళ్లకు స్మార్ట్ మీటర్లను బిగించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కాలనీలో సుమా రు 200కు పైగా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించారు. ఇవి తమకు వద్దని చెబుతున్నా బలవంతంగా బిగిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
టార్గెట్ కోసం కాంట్రాక్టర్ తిప్పలు
స్మార్ట్ మీటర్ల బిగింపు లక్ష్యాన్ని పూర్తి చేసుకునేందుకు కాంట్రాక్టర్ తిప్పలు పడుతున్నారు. మండలంలో ఇప్పటికే వ్యాపార సంస్థలు, పరిశ్రమలకు, చిరు వ్యాపా రాలకు వీటిని బిగించారు. అపార్ట్‌మెంట్లలో ఒకేసారి 40 నుంచి 80 వరకూ మీటర్లను బిగిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో మీటర్లు బిగించేందుకు జగనన్న కాలనీల వైపు దృష్టి సారించారు. ఇదిలా ఉండగా ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన లోకేష్ ఇప్పుడు మీటర్లు బిగిస్తుంటే నోరు మెదపడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. కొన్నినెలల క్రితం స్మార్ట్ మీటర్లను ప్రజలు వ్యతిరేకిస్తే బిగింపు ఆపారని, మరలా ఇప్పుడు మొదలు పెట్టారని అంటున్నారు.
స్మార్ట్ మీటర్ల వల్ల పేద, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడతాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం ఆందోళన చేపట్టింది. మరలా ప్రజా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకువస్తాం. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలి.
– కె.తవిటినాయుడు,
సీపీఎం మండల కార్యదర్శి, ఆకివీడు
పేదల ఇళ్లపై స్మార్ట్ పిడుగు


