న్యాయవాదులకు బీమా కల్పించాలి
అత్తిలి: న్యాయవాదులకు మెడికల్ ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వం కల్పించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) డిమాండ్ చేసింది. శనివారం తణుకు బార్ అసోసియేషన్‌లో ఐలు జిల్లా కమిటీ సమావేశాన్ని జి.విజయభాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దిగ్గుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో 50 వేల మంది న్యాయవాదులు ఉన్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ప్రతి మండల పరిధిలో ఒక కోర్టును ఏర్పాటు చేయాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు రెండేళ్లుగా ఉపకార వేతనాలు ఇవ్వడం లేదన్నారు. న్యాయవాదులు కామన మునిస్వామి, కౌరు వెంకటేశ్వర్లు, మేక ఈశ్వయ్య, కేఎల్ సత్యవతి, పి.పెద్దిరాజు, పీపీ లక్ష్మీ, పి.లలితకుమారి, పి.మణికంఠ పాల్గొన్నారు.
భీమవరం: ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలు–2026కు ఫీజు చెల్లింపు, నామినల్ రోల్స్ సమర్పించే విషయంలో సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుచేసినట్టు డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. టెక్నికల్ సమస్యల విషయంలో డి.ఈస్టర్ బాబు ఏఎస్‌ఓను సంప్రదించాలన్నారు. ఎన్.సత్యనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, సెల్: 99891 08476, ఎన్‌వీఎన్‌కే తిరుపతి రాజు సూపరింటెండెంట్, సెల్: 94919 69299, డి. ఈస్టర్‌బాబు, ఏఎస్‌ఓ సెల్: 90102 44677, పి.కుమారస్వామి, సీనియర్ అసిస్టెంట్ సెల్: 94414 85204, డి.ఆశీర్వాదం, ఏపీఓ సెల్: 99496 36680 నంబర్లలో సంప్రదించవచ్చు.
జంగారెడ్డిగూడెం: స్థానిక బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పొడపాటి కావ్య మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ శనివారం ఆమె పోస్టుమార్టం నిర్వహించకుండా ఆందోళన చేశారు. ఏరియా ఆస్పత్రిలో మార్చురీ వద్ద ఆందోళన, శ్రీనివాసపురంలో రాస్తారోకో చేశారు. కావ్య కుటుంబ సభ్యులు, జొన్నవారిగూడెం గ్రామస్తులు, దళిత, విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. కావ్య మృతికి కారణం పాఠశాలలోని ఉపాధ్యాయులని, వారిని పిలిపించి తమతో మాట్లాడించాలని డిమాండ్ చే శారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరి కిది కాదని బాలిక తండ్రి గంగాధరరావు, మే నత్త వెంకటలక్ష్మి అన్నారు. ఆందోళన సాయంత్రం వరకు సాగింది. తహసీల్దార్ కే.స్లీవజోజి, సీఐ ఎంఎస్ సుభాష్, ఎస్‌ఐలు ఎంవీ ప్రసాద్, షేక్ జబీర్, ఎం.కుటుంబరావు, గురుకుల పాఠశాలల జిల్లా కో–ఆర్డినేటర్ బి.ఉమాకుమారి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఒక దళిత విద్యార్థి మృతి చెందితే దళిత ఎమ్మెల్యే కనీసం తమను పలకరించలేదని ఎమ్మెల్యే రో షన్‌ను ఉద్దేశించి ధ్వజమెత్తారు. చివరికి ఆందోళనకారులకు నచ్చచెప్పి ఆర్‌డీఓ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఆర్డీఓ ఎంవీ రమణ మాట్లాడుతూ కావ్య కుటుంబానికి న్యాయం చేస్తామని, న్యాయ విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం కావ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పోలీస్ బందోబస్తు నడుమ జొన్నవారిగూడెం తీసుకువెళ్లి కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేశారు.
కొయ్యలగూడెం: వర్జీనియా పొగాకు కొనుగోలు వేలం ప్రక్రియ శనివారంతో ముగిసింది. వేలం కేంద్రానికి 1,592 బేళ్లను రైతులు తీసుకురాగా వాటిని కొనుగోలు చేయడం పూర్తయ్యింది. మొత్తంగా 192 రోజుల్లో రూ.530 కోట్ల వి లువైన 17.87 మిలియన్ల కిలోల పొగాకును రైతుల నుంచి కొనుగోలు చేశారు. సుమారు 25 కంపెనీలు ప్రాతినిధ్యం వహించగా రూ.453 గరిష్ట ధరతో రికార్డు పలికింది. కిలో కు సగటు ధర రూ.296 వచ్చింది.
న్యాయవాదులకు బీమా కల్పించాలి


