వరి కోతల్లో రైతులు బిజీ
పెనుగొండ: ఆచంట నియోజకవర్గంలో సార్వా కోతలు ఊపందుకొంటున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే సగంకుపైగా కోతలు పూర్తి కావాల్సి ఉన్నా, మోంథా తుపాను ప్రభావంతో కోతలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులుగా కోతలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గంలో ఆచంట మండలంలో 10,200 ఎకరాల్లోనూ, పెనుగొండ మండలంలో 1,100, పెనుమంట్ర మండలంలో 13,200, పోడూరు మండలంలో 11400 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వీటిలో 70 శాతంకు పైగా రైతులు ఎంటీయూ 1318 వరి రకం, మిగిలిన వారు స్వర్ణ, ఎంటీయూ 1121, పీఆర్ 126 వరి రకాలు వచ్చేసీజన్‌కు విత్తన రకాలుగా సాగు చేసారు. విత్తన రకాలు సాగు చేసిన రైతన్నలు ముందుగానే కోతలు పూర్తి చేసి ఇప్పటికే ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకొన్నారు. మిగిలిన రైతులు నెమ్మదిగా కోతలకు శ్రీకారం చుట్టారు. కోతలకు రైతులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు.
దిగుబడులపై ప్రభావం
మోంథా తుపాను ప్రభావంతో నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోనూ వేలాది ఎకరాలు వరిచేలు నేలకొరిగాయి. వీటిని కోయడానికి నానావస్థలు పడుతున్నారు. వ్యవసాయ శాఖాధికారుల సూచనల మేరకు పడిన వరి దుబ్బులను లేపి కట్టుకొన్నా, గింజ ఎక్కువగా నేలకు రాలిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో దిగుబడులపై ప్రభావం చూపింది. దిగుబడులు తగ్గడం, కోతకు వ్యయం పెరగడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. పెనుగొండ మండలంలో నడిపూడి, ఇలపర్రు, వడలి, కొఠాలపర్రుల్లోనూ, ఆచంట మండలం ఆచంట వేమవరం, కొడమంచిలి, వల్లూరు, ఇతర గ్రామాల్లోనూ, పెనుమంట్ర మండలం ఇల్లిందల పర్రు, మల్లిపూడి, రామేశ్వరం, మాముడూరు గ్రామాల్లోనూ, పోడూరు మండంలోని పలు గ్రామాల్లోనూ వరి నేలకొరిగింది. ఆయా గ్రామాల్లో వరి కోతలకు అదనంగా యంత్రాలకు మరో రూ.2 వేలు ఖర్చు అవుతుండడంతో భారంగా మారింది. ఎకరం గంటలో పూర్తి కావలసి ఉండగా, మరో అరగంట నుంచి గంట వరకూ వరి కోత యంత్రానికి కోతకు సమయం పడుతుంది. దీంతో అదనపు భారం పడుతుండడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వాతావరణంలో మార్పులు రాకముందే మిగిలిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకొని గట్టేక్కాలని రైతులు ఆఘమేఘాలపై కోతలు కోయడానికి యత్నాలు చేసుకొంటున్నారు.
వరి కోతల్లో రైతులు బిజీ


