
పని భారంతో అవస్థలు
సక్రమంగా అందని జీతాలు, పీఎఫ్ సౌకర్యం నిల్
భీమవరం (ప్రకాశం చౌక్) : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికుల కొరత వేధిస్తోంది. దీంతో పనిచేస్తున్న కార్మికులపై పని భారం పెరిగి అవస్థలు పడుతున్నారు. 8 గంటలు చేయాల్సిన డ్యూటీని 12 నుంచి 15 గంటలపాటు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క సక్రమంగా అందని జీతాలు, మరో పక్క పనిభారం, అధికారుల వేధింపులతో పారిశుద్ద్య కార్మికులు విసుగెత్తిపోతున్నారు.
సగం మంది సిబ్బందితోనే కాలక్షేపం
జిల్లాలో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నర్సాపురం 100 పడకల ఆస్పత్రుల స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో 20 మంది పారిశుద్ధ్య సిబ్బందికిగాను కేవలం 10 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. అలాగే జిల్లా ఆస్పత్రి తణుకులో 40 మంది కార్మికులకుగాను కేవలం 20 మంది కార్మికులతో నెట్టుకొచ్చేస్తున్నారు. అలాగే సీహెచ్‌సీలుగా ఉన్న పెనుగొడం, ఆచంట, ఆకివీడు ఆస్పత్రుల్లో 10 మంది చొప్పున సిబ్బందికిగాను కేవలం ఒకొక్క ఆస్పత్రిలో ఆరుగురితో పనిచేయిస్తున్నారు. రోగుల సంఖ్య పెరుగుతున్నా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచకపోవడంతో వారు పనిభారంతో ఘొల్లుమంటున్నారు.
ఫినాయిల్, చెత్త కవర్లూ కొరతే
జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫినాయిల్,, చెత్త వేసుకునే కవర్లు ఇతర మెటిరియల్ కోరత ఉంది. 100 పడకల స్థాయిలో ఉన్న ఆస్పత్రికి సైతం కేవలం 50 పడకల ఆస్పత్రికి సరిపోయే మెటీరియల్‌ను మాత్రమే సరఫరా చేస్తున్నారు. దాంతో ఆస్పత్రులు శుభ్రంగా ఉండడం లేదు. భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిల్లో పారిశుద్ద్య కార్మికులు కొన్నిసార్లు తమ సొంత ఖర్చుతో ఫినాయిల్ కొనుగోలు చేసి ఆస్పత్రిని శుభ్రం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
పనిభారం పెరిగినా కష్టపడి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కాంట్రాక్టర్ సక్రమంగా జీతాలు చెల్లించడం లేదు. నాలుగు నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వడం, ఒక నెల పెండింగ్ పెట్టడంతో బతుకు బండి నడిపేందుకు కార్మికులు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తతోంది. ఇక జీతాల నుంచి పీఎఫ్ మినహాయింపు సైతం చేయడం లేదు. తమ కుటుంబాల కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న తమపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని పారిశుద్ధ్య కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికై న కూటమి ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచి తమకు పని భారం తగ్గించాలని, అలాగే తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, పీఎఫ్ సమస్య పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు.