
పీఓపీ విగ్రహాలతో చేటు
న్యూస్‌రీల్
ఆరోగ్యానికి ముప్పు
ప్రకటనలకే పరిమితం.. చర్యలు శూన్యం
శురకవారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2025
భీమవరం(ప్రకాశం చౌక్): వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాటుచేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉంది. ఏటా వీటిని కాలువలు, చెరువుల్లో నిమజ్జనం చేయడం జల కాలుష్యానికి కారణమవుతోంది. పీఓపీ విగ్రహాలపై నిషేధం ఉన్నా ఏటా వేలల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయినా కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏటా జిల్లాలో 2 నుంచి 30 అడుగుల వరకు పీఓపీ విగ్రహాలను సుమారు 10 వేల వరకూ ఏర్పాట్టు చేస్తున్నట్టు అంచనా.
జలచరాలకు హాని.. ప్రమాదకరమైన రంగులు, నీటిలో కరగని పదార్థాలతో పీఓపీ విగ్రహాలను తయారుచేస్తున్నారు. అయితే వీటిని నిమజ్జనం చేసిన సమయంలో 70 శాతం వరకు మాత్రమే నీటిలో కరిగి మిగిలిన రంగులు, పదార్థాలు కరగకపోవడం జలకాలుష్యానికి కారణమవుతోంది. అలాగే కాలువలు, గోదావరిలో జీవించే జల చరాలకు ముప్పు వాటిల్లుతోంది.
ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు
జిల్లాలో 90 శాతం పీఓపీ విగ్రహాలను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు తయారుచేసి విక్రయిస్తున్నారు. వినాయకచవితికి రెండు, మూడు నెలల ముందే కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చి తాత్కాలికంగా గుడారాలు ఏర్పాటుచేసుకుని వీటిని తయారుచేస్తున్నారు. ఇలా జిల్లాలో 50 వరకు కుటుంబాలు పీఓపీ విగ్రహాలను తయారుచేస్తున్నాయి. అయితే పీఓపీ విగ్రహాలను తయారు చేసే కార్మికుల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. విగ్రహాలను తయారుచేసే సమయంలో రంగులను పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు దెబ్బతినడం, క్యాన్సర్, చర్మవ్యాధులు, నేత్ర సమస్యలతో బాధపడుతున్నారు.
జిల్లాలో జోరుగా విక్రయాలు
జిల్లాలో అత్తిలి, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, పెనుగొండ, నరసాపురం, మొగల్తూరు, చించినాడ తదితర ప్రాంతాల్లో పీఓపీ విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. ఏటా జిల్లాలోని 409 పంచాయతీలు, ఆరు మున్సిపాలిటీల్లో సు మారు 10 వేల వరకూ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. వీటిలో 90 శాతం వరకూ పీఓపీ విగ్రహాలే ఉంటున్నాయి. వీటి ధరలు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు ఉన్నాయి.
మట్టి విగ్రహాలే మేలు
పీఓపీ విగ్రహాల ఏర్పాటు విషయంలో ఉత్సవ కమిటీ నిర్వాహకుల ఆలోచనల మారాలని, మట్టి విగ్రహాలను ఏర్పాటుచేసి నవరాత్రుల్లో పూజించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. పీఓపీ విగ్రహాలపై అందరూ అవగాహన పెంచుకుని పర్యావరణానికి మేలు చేయాలని అంటున్నారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) నీటిలో కలిసినప్పుడు జిప్సంగా మారుతుంది. ఇది నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గించి, జలచరాలకు హాని చేస్తుంది. విగ్రహాలను విషపూరిత రసాయనాలు, రంగులు, భారీ లోహాలతో (లెడ్, మెర్కూరీ, సీసం, పారాదీ) తయారు చేస్తారు. ఇవి నీటిని కలుషితం చేసి, పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. అలాగే ఇవి మానవ ఆరోగ్యానికి కూడా హాని కలిగి స్తాయి. వీటిని నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కొన్ని లోహాలు కరగకుండా అలానే ఉండిపోతాయి. ఈ నీటిని తాగిన పశువులు, మనుషులకు క్యాన్సర్లు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పీఓపీ విగ్రహాల బదులు మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకోవడం పర్యావరణానికి శ్రేయస్కరం.
– డాక్టర్ పీఏఆర్‌కే రాజు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, భీమవరం
మట్టి ప్రతిమలే మేలు
ఏటా 90 శాతానికి పైగా పీఓపీ విగ్రహాల ఏర్పాటు
5 నుంచి 30 అడుగుల వరకు ప్రతిమలు
జిల్లాలో సుమారు 10 వేల విగ్రహాలు
వీటి నిమజ్జనంతో జల కాలుష్యం
అధికారుల చర్యలు శూన్యం
మట్టి విగ్రహాలను పూజించాలంటున్న పర్యావరణ వేత్తలు
ఏటా జిల్లా ఉన్నతాధికారులు వినాయక చవితికి ముందు పీఓపీ విగ్రహాలు నిషేధం అంటూ ప్రకటనలు ఇవ్వడంతోనే సరిపెడుతున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి విగ్రహా తయారీదారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అలాగే తయారీదారులకు, ఉత్సవ కమిటీలకు విగ్రహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదు. కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు సమావేశాలకు హాజరవడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

పీఓపీ విగ్రహాలతో చేటు

పీఓపీ విగ్రహాలతో చేటు

పీఓపీ విగ్రహాలతో చేటు