
పోటెత్తిన వశిష్ట గోదావరి
● లంక గ్రామాల్లోకి నీరు
● ముంపులోనే కనకాయలంక కాజ్‌వే
● నరసాపురంలో పంటు రాకపోకలు నిలిపివేత
పెనుగొండ/యలమంచిలి/నరసాపురం: జిల్లాలో వశిష్ట గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సిద్ధాంతం వద్ద కేదారీఘాట్, పుష్కర రేవులు వరద నీటిలో మునిగాయి. గురువారం మధ్యస్థ లంకలోకి నీరు ప్రవేశించడంతో కూరగాయలు, ఇతర ఉత్పత్తులను రైతులు పడవలపై గట్టుకు చేరుస్తున్నారు. వరద మరింత పెరిగే పశువులను ఏటిగట్టుపైకి తీసురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయానికి సిద్ధాంతం, కోడేరు, అయోధ్యలంకల్లో ఉధృతి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. పడవ ప్రయాణాలపై అధికారులు నియంత్రణ విధించారు. వరద భయంతో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
యలమంచిలిలో స్థిరంగా..
యలమంచిలి: మండలంలో గోదావరి వరద స్థిరంగా ఉంది. మూడో రోజూ కూడా కనకాయలంక కాజ్‌వే ముంపులోనే ఉంది. దీంతో ఇంజన్ పడవలపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. కాజ్‌వేపై మూడడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. రెండు రోజుల పాటు వరద స్థిరంగా ఉంటుందని అధికారిక సమాచారం.
పంటు రాకపోకలు బంద్
నరసాపురంలో వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చి ంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు రావడంతో స్థానికంగా నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో నరసాపురం–సఖినేటిపల్లి మధ్య పంటు రాకపోకలు నిలిపివేశారు. దీంతో చించినాడ బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి వస్తోంది. అయితే చించినాడ బ్రిడ్జి మరమ్మతులతో పూర్తిస్థాయిలో రాకపోకలు సాగ డం లేదు. నరసాపురంలోని వలంధర్ రేవులో పిండ ప్రదానం షెడ్డు వరకూ నీరు చేరింది. అధికారు లు రేవులో స్నానాలను నిషేధించారు.
సమర్థంగా ఎదుర్కొంటాం: జేసీ
యలమంచిలి: గోదావరి వరదను సమర్థంగా ఎదుర్కొంటామని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి చెప్పా రు. కనకాయలంక గ్రామంలో ఆయన పర్యటించి లోతట్టు ప్రాంతాలు, మెడికల్ క్యాంపు, అంగన్‌వాడీ కేంద్రం, రేషన్ షాపులను పరిశీలించారు. ధవళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యిందని, జిల్లాలోని పెనుగొండ, ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని ఏడెనిమిది లంక గ్రా మాలపై ప్రభావం ఉంటుందన్నారు. కనకాయలంకలో రాకపోకలకు ఆరు బోట్లు నడుపుతున్నామన్నారు. 50 నుంచి 60 లైఫ్ జాకెట్స్ సిద్ధం చేయ మని ఆదేశాలిచ్చామన్నారు. లంక గ్రామాల్లోని మంచం మీద ఉన్న రోగులు, గర్భిణులు, బాలింతలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. వరద ప్రభావిత గ్రామాల్లోని 34 రేషన్ షాపుల్లో మూడు నెలల రేషన్ సరుకులు నిల్వ ఉంచామన్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో స్కూల్ పిల్లలకు సెలవులు ఇస్తున్నట్టు చెప్పారు. నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, తహసీల్దార్ గ్రంథి నాగ వెంకట పవన్‌కుమార్, ఎలక్ట్రికల్ ఈఈ కె.మధుకుమార్, జిల్లా మత్స్యశాఖాధికారి నాగలింగాచార్యులు, ఎఫ్‌డీఓ ఏడుకొండలు ఉన్నారు.
నరసాపురం: రేవులో నిలిచిన పంటు
పెనుగొండ: సిద్ధాంతంలో లంక నుంచి వ్యవసాయ ఉత్పత్తులను గట్టుకు చేరుస్తూ..

పోటెత్తిన వశిష్ట గోదావరి

పోటెత్తిన వశిష్ట గోదావరి

పోటెత్తిన వశిష్ట గోదావరి