
అనుగృహమెప్పుడో..?
ఒక్క సెంటూ కొనలేదు
అప్పులు తప్ప బిల్లుల్లేవు
సాయం అందించాలి
ఆకివీడు: పేదలకు సొంతింటి నిర్మాణం కలగానే మిగలనుంది. కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో గృహ నిర్మాణాల ఊసెత్తకపోవడం పేదలకు శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇళ్ల నిర్మాణానికి రూ.4 లక్షల చొప్పున సాయం చేస్తామన్న నాయకుల హామీలు అమలుకావడం లేదు. జిల్లాలో ఒక్క ఇంటిని కూడా పేదలకు మంజూరు చేయకపోగా సెంటు స్థలం కూడా సేకరించిన దాఖలాలు లేవు. ఇళ్ల నిర్మాణాలకు వేలాది దరఖాస్తులు ప్రభుత్వ కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. ఇళ్లకు సంబంధించి ఆన్‌లైన్ సైట్లు మూసివేయడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఆన్‌లైన్‌లో సైట్‌లు తెరవకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే గత ప్రభుత్వంలో స్థలం మంజూరై ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు కూటమి ప్రభు త్వం బిల్లులను ఇవ్వడం లేదు. దీంతో నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. లబ్ధిదారులు అప్పులతో సతమతమవుతున్నారు. తమకు ఇళ్లను ఇవ్వకపోగా కూటమి ప్రభుత్వం ఉన్న పూరిళ్లను కూలదోస్తుందని పేదలు ఆవేదన చెందుతున్నారు.
గత ప్రభుత్వంలో వేలాదిగా ఇళ్లు : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 73,392 మందికి ఇళ్ల నిర్మాణాల నిమిత్తం రూ.1.80 లక్షల చొప్పున సాయం, డ్వాక్రా రుణం రూ.30 వేల చొప్పున అందజేశారు. 35,778 మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయగా మరో 25 వేల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వంలో ఈ ఇళ్ల నిర్మాణాలకు బిల్లు లు అంతంతమాత్రంగా జమవుతున్నాయి. శ్లాబ్ పనులు పూర్తి చేసినవారికి రూ.1.80 లక్షలు జమ కావాల్సి ఉండగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
సర్వేలతో ఇళ్ల పట్టాలు వెనక్కి
కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీల్లో సర్వేను వేగవంతం చేసింది. నిర్మాణాలు చేపట్టని పేదల ఇంటి స్థలాలను వెనక్కి తీసుకుంటోంది.
కేంద్రం నుంచి ఇళ్ల మంజూరు ఏదీ?
కేంద్ర ప్రభుత్వం నుంచి పేదల ఇళ్ల నిర్మాణం కోసం అధిక మొత్తంగా నిధులు తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. 2.0 పథకం ద్వారా ఈ ఏడాది జిల్లాకు 595 ఇళ్లు మంజూరు చేసినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇళ్లను ఆన్‌లైన్‌లో మాత్రమే చూపిస్తున్నారని పలువురు అంటున్నారు.
పేదల గూడును కూలదోసి.. కూటమి పాలనలో పేదలకు ఇళ్లు నిర్మించుకోకపోగా కాలువ గట్లు, రోడ్డు పక్కన నివసిస్తున్న వారి గుడిసెలను కూలదోస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు పేరుతో పేదల పూరిళ్లను తొలగిస్తున్నారు.
ఇళ్లకు చంద్ర గ్రహణం
ఒక్క ఇంటికీ మోక్షం లేదు
సెంటు భూమి పంపిణీ చేయలేదు
ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు లేవు
పేదలకు కలగా సొంతింటి నిర్మాణం
గత ప్రభుత్వంలో 73 వేల మందికి స్వగృహ ప్రాప్తి
కూటమి పాలనలో పేదల కోసం భూసేకరణ చేయలేదు. ఒక్క సెంటు భూమి కొనలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు. కాలనీల్లో మౌలిక వసతులు కల్పించలేదు. ఇంటి నిర్మాణాలపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. ఇల్లు నిర్మించుకునే వారికి వెంటనే సాయం చేయాలి. రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలి.
– జేఎన్‌వీ గోపాలన్, సీపీఎం నేత
పేదల ఇళ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడం లేదు. 15 నెలలు గడిచినా పేదలకు ఇంటి నిర్మాణ బిల్లులు వేయడం లేదు. అప్పులతో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. పెండింగ్ బిల్లులు వెంటే క్లియర్ చేయాలి. హామీ మేరకు రూ.4 లక్షల సాయం అందించాలి.
– బి.రవివర్మ, పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు, ఆకివీడు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనలో నాకు ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాం. గతంలోనే ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం శ్లాబ్ వరకూ పూర్తయినా బిల్లులు రాలేదు. అప్పు లు చేసి ముందుకు వెళ్లలేకపోతున్నాం.
– సోమరాజు లక్ష్మి, లబ్ధిదారురాలు,
తాళ్లకోడు, ఆకివీడు మండలం

అనుగృహమెప్పుడో..?

అనుగృహమెప్పుడో..?