
ప్రాణం తీసిన కూటమి నిర్లక్ష్యం
సమయానికి 108 వస్తే బతికేవాడు
ఏలూరు టౌన్ : 108 అంబులెన్స్‌లు మృత్యు శకటాలుగా మారాయి. బ్రేకులు లేకపోవటంతో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రుడు ఏలూరు జీజీహెచ్‌కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. 25 కిలోమీటర్ల లోపు దూరం వెళ్లేందుకు 2 గంటలకు పైగా సమయం పట్టటంతో క్షతగాత్రుడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అంబులెన్స్‌లు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నడవలేని స్థితికి చేరాయి. ఈ నేపథ్యంలో ఏలూరు జీజీహెచ్ వద్ద మృతుడి బంధువులు, స్నేహితులు శుక్రవారం రాత్రి ఆందోళన చేపట్టారు.
బాధితుల కథనం మేరకు.. ఏలూరు వన్‌టౌన్ నాగేంద్రకాలనీకి చెందిన వీ.గోపీకృష్ణ (20) నగరంలోని మెడికల్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వస్తుండగా.. కామవరపుకోట మండలం ఆడమిల్లి వద్ద ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు 108కు ఫోన్ చేశారు. తాపీగా స్పందించిన 108 జిల్లా అధికారులు కామవరపుకోట పీహెచ్‌సీ నుంచి సంఘటనా స్థలానికి బ్రేకులు లేని అంబులెన్స్‌ను పంపించారు. బ్రేకులు లేకపోవటం, లైట్లు వెలగని దుస్థితిలో డ్రైవర్ చేసేదేమీ లేక మెల్లగా డ్రైవ్ చేస్తూ వచ్చాడు. కనీసం సైరన్, హారన్ కూడా లేకపోవటం గమనార్హం. ఈ లోగా మృతుడి స్నేహితులు, బంధువులు ప్రశ్నించగా బ్రేకులు లేవని డ్రైవర్ చెప్పాడు. దీంతో స్నేహితులంతా 108 అంబులెన్స్‌కు ముందు పైలట్స్‌గా వ్యవహరిస్తూ వాహనానికి అడ్డులేకుండా నగరంలోని ఆంధ్రా హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం బాధితుడి బంధువులు, స్నేహితులు అంబులెన్స్‌ను ఏలూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు.
డోర్స్‌ను గుడ్డతో కట్టిన దృశ్యం
కనీసం డోర్ హ్యాండిల్స్ లేని 108 అంబులెన్స్
అంబులెన్స్ లైట్ల వద్ద తాళ్ళతో కట్టిన వైనం
ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని ఉంటే.. తమ స్నేహితుడు ప్రాణాలతో ఉండేవాడని మృతుడి స్నేహితుడు మనోహర్ వాపోయాడు. సుమారు 2గంటలకు పైగా సమయం పట్టిందని, ఇలాంటి వాహనాలను ఏ విధంగా వినియోగిస్తారో చెప్పాలంటూ ప్రశ్నించాడు. క్షతగాత్రుడిని రక్షించేందుకు బ్రేకులు, లైట్లు, సైరన్ లేని అంబులెన్స్ ఎలా పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మృత్యుశకటాలుగా 108 అంబులెన్స్‌లు
రోడ్డు ప్రమాద క్షతగాత్రుడితరలింపునకు 2 గంటలు సమయం
అంబులెన్స్‌కు బ్రేకులు, లైట్లు, డోర్‌లు తాళ్ళతో కట్టిన వైనం
ఏలూరు జీజీహెచ్‌కు చేరేలోపే యువకుడి మృతి

ప్రాణం తీసిన కూటమి నిర్లక్ష్యం

ప్రాణం తీసిన కూటమి నిర్లక్ష్యం

ప్రాణం తీసిన కూటమి నిర్లక్ష్యం