ఆగిరిపల్లి: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని చిన్న ఆగిరిపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చిన్న ఆగిరిపల్లికి చెందిన చెందిన రాముకు కృష్ణాజిల్లా కూచిపూడికి చెందిన వెంకట సోనియాకు (28) ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొద్ది రోజులుగా రాముకు, సోనియాకు మధ్య మనస్పర్థలతో గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం సోనియా పుట్టింటికి వెళ్లి వెంటనే తిరిగి రాలేదని భర్త ఆమెతో మాట్లాడటం లేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోనియా తండ్రి వీరస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దెందులూరు: ప్రమాదవశాత్తూ చెరువులో జారి పడి ఓ యువకుడు మృతి చెందాడు. కొవ్వలి వీఆర్‌ఓ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కొవ్వలి గ్రామానికి చెందిన కానూరి రామయ్య కుమారుడు అభిషేక్ డిగ్రీ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం అభిషేక్ అతని స్నేహితుడు ఇంకేటి రాహుల్‌తో కలిసి బహిర్భూమికని కుంటల చెరువు కు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తూ అభిషేక్ కాలుజారి చెరువులో పడిపోయాడు. అతడ్ని రక్షించేందుకు రాహుల్ ప్రయత్నించి చెరువులో పడిపోవడంతో అతడ్ని స్థానికులు రక్షించారు. ఈ ఘటనలో అభిషేక్ చెరువులో మునిగి మృతి చెందాడు.
పోలవరం రూరల్ : మనస్తాపంతో ఓ వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన పోలవరంలో చోటుచేసుకుంది. ఎస్సై ఎస్‌ఎస్ పవన్‌కుమార్ తెలిపిన వివరాలివి. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నామని, ఇక్కడ వ్యాపార లావాదేవీలు ఏవీ లేవని, రాజమండ్రి వెళ్లిపోదామని కిలపర్తి విజయ (40) భర్త శేఖర్‌తో ఇటీవల వాగ్వివాదం చేసింది. అనంతరం మనస్థాపానికి గురైన విజయ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు ఈశ్వర్ సాయిచంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భీమడోలు: భీమడోలులోని గుర్రాల చెర్వు గట్టు వద్ద ఓ ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన దూబ లక్ష్మణరావు, నీలవేణి దంపతులు ఈనెల 19వ తేదీ ఉదయం ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నాం వచ్చేసరికి ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. బీరువాలోని ఆరు కాసుల బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదును అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.