
భీమవరం(ప.గో. జిల్లా): బెల్ట్ షాపులు తొలగించాలని, అదే సమయంలో తమ ఉపాధిని కాపాడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో భీమవరంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. శుక్రవారం(ఆగస్టు 22వ తేదీ) జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.
దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కొల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి జుత్తిక నరసింహమూర్తి మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 14 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో అక్రమ మద్యం, కల్తీ మద్యం, బెల్టు షాపులతో మద్యాన్ని వరదలా పారిస్తున్నారు.
గ్రామాలను మద్యంతో ముంచేస్తున్నారు. మంచినీళ్లు లేక అనేక గ్రామాలు ఉన్నాయి మంచినీళ్లు ఇవ్వటం మా వల్ల కాదు.. మద్యం తాగండి అని కూటమి ప్రభుత్వం చెబుతుంది. బెల్ట్ షాపులు తొలగించండి మా ఉపాధిని కాపాడండి తాటి చెట్టు పై నుంచి పడి మరణించిన వ్యక్తికి ఎక్స్ గ్రేషియా ఇవ్వండి అనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఈ రాష్ట్రంలో 75 వేల బెల్టు షాపులు ఈ జిల్లాలో 4 వేల బెల్ట్ షాపులు తొలగించే వరకు మా పోరాటం ఆగదు. ఇదే ప్రభుత్వానికి మా హెచ్చరిక. ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి బెల్ట్ షాపులు తొలగిస్తాం. బెల్ట్ షాపులు పెడితే తోలు వలిచేస్తాం అని అన్నారు. ఇప్పటివరకు మీరు ఎంతమంది తోలు తీశారు ఎన్ని బెల్ట్ షాపుల్లో తొలగించారు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈనెల 30వ తారీఖున భీమవరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద వందలాదిమంది గీత కార్మికులు మోకులు ధరించి పెద్ద ఎత్తున ఆ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు.