
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న వక్తలు
వైద్య కళాశాలల పరిరక్షణ సమితి హెచ్చరిక
కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన ప్రజాప్రతినిధులు, సంఘాల నేతలు
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్ని పీపీపీ విధానం పేరిట ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోకుంటే ఉద్యమం తప్పదని పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ సమితి హెచ్చరించింది. శనివారం పాలకొల్లులోని పూలపల్లి అంబేడ్కర్ భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో ‘పాలకొల్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ’ అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఇందులో భాగంగా 17 మెడికల్ కళాశాలలను జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం గత ప్రభుత్వం రూ.2,400 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంకా దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు అని గొప్పలు చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అరకొర పనులు చేపట్టిందని కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ వాటిని ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించామని కబుర్లు చెబుతూ ప్రజలకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పీపీపీ అంటూనే వైద్యకళాశాలలు ప్రైవేటుపరం కావని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. పీపీపీ పద్ధతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకే కాకుండా ఓసీ కులాల్లోని పేద విద్యార్థులకూ నష్టం కలిగిస్తుందన్నారు.
వైద్యం, విద్య రెండూ ప్రభుత్వ రంగాల్లో ఉంటేనే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికే విద్య, వైద్యం రెండూ ఖరీదయ్యాయని, మరింత ఖరీదు కాకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సీపీఎం నేత జేఎన్‌వీ గోపాలన్, దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్, సంచార జాతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్ర వీరన్న, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు జవ్వాది శ్రీనివాసరావు, జేవీవీ జిల్లా నాయకుడు యర్రా అజయ్‌కుమార్, దగ్గులూరు సర్పంచ్ పేరయ్య, పట్టణ జేఏసీ చైర్మన్ గుడాల హరిబాబు తదితరులు మాట్లాడారు.