
- జలవనరుల బోర్డులో డైరెక్టర్ పదవి తిరస్కరిస్తూ చంద్రబాబుకు అంగర లేఖ
- నియోజకవర్గంలో మరో నేత ఎదగకుండా నిమ్మల అడుగులు
- చైర్మన్ పదవిని ఆశించిన మరో ఇద్దరు నేతలకు డైరెక్టర్ పదవులతో చెక్
- నామినేట్ పదవులు వద్దని వారిద్దరూ బహిరంగంగా వెల్లడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు పాలకొల్లు తెలుగు తమ్ముళ్లు ఝలక్ ఇచ్చారు. నియోజకవర్గంలో కేడర్ నుంచి లీడర్ వరకు తానేనంటూ.. తక్కువ పనితో ఎక్కువ పబ్లిసిటీతో నిత్యం ఫోకస్‌లో ఉండే మంత్రి తీరుపై తిరుగుబాటు జెండా ఎగురేస్తున్నారు. నియోజకవర్గంలో భవిష్యత్‌లో కూడా తనకు పోటీగా ఎవరూ ఉండకూడదని.. దానికనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ కీలక నామినేటెడ్ పదవులు తన నియోజకవర్గంలో దక్కకుండా తెరవెనుక చక్రం తిప్పుతున్నారు.
తెరమీద పదవులు ఇవ్వాలి కాబట్టి డైరెక్టర్ పదవులతో మమా అనిపించడంతో తిరుగుబాటు మొదలైంది. పదేళ్లు మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన అంగర రామ్మోహనరావును జలవనరుల శాఖ బోర్డు డైరెక్టర్‌గా నియమించడంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. తాను పదవి తీసుకోలేనంటూ చంద్రబాబుకే లేఖ రాశారు. ఇదే రీతిలో నామినేటెడ్ పదవులు పొందిన మరో ఇద్దరు డైరెక్టర్లు కూడా తమకు ఈ పదవులు వద్దని బహిరంగంగా ప్రకటించడం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది.
పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి రామానాయుడు రాజకీయ ఎత్తుగడలకు టీడీపీ కేడర్ చెక్‌పెడుతోంది. బీసీ సామాజిక వర్గంలో పట్టు ఉన్న అంగర రామ్మోహనరావు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలో పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో పాలకొల్లు ఎంపీపీగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జెడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తరువాత చంద్రబాబు హయాంలో పాలకొల్లు ఎంపీపీగా, రెండు పర్యాయాలు మండలి సభ్యుడిగా ఉన్నారు. మండలి విప్‌గా, లెజిస్టేటివ్ లైబ్రరీ చైర్మన్‌గా పనిచేశారు.
పార్టీ ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అనేక కార్యక్రమాలు నిర్వహించానని రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు సభ్యుడి పదవి తాను స్వీకరించలేకపోతున్నానని ముఖ్యమంత్రికి లేఖ రాయడం తీవ్ర కలకలం రేపింది. వాస్తవానికి అంగర ప్రభుత్వంలో కీలక పదవి లేదా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఆశించారు. పార్టీ అధిష్టానం కూడా ఆ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే నియోజకవర్గంలో మంత్రిగా నిమ్మల రామానాయుడు ఉన్నారు. రాజకీయంగా అంగర పాలకొల్లులో సీనియర్. అలాంటిది జూనియర్ నేత మంత్రిగా ఉన్న శాఖలో చైర్మన్ కాకుండా డైరెక్టర్ పదవితో అవమానించారనేది రామ్మోహనరావు ఆవేదన. దీంతో గత వారం లేఖ ద్వారా అసంతృప్తిని తెలియజేశారు.
అంగర బాటలో మరో ఇద్దరు
మొత్తంగా పాలకొల్లు నియోజకవర్గానికి ఇటీవల మూడు నామినేటెడ్ పదవులు దక్కాయి. విచిత్రమేమిటంటే ఒక్క రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి దక్కిన నేత ఈ నియోజకవర్గంలో లేకపోవడం గమనార్హం. పారీ్టలో సీనియర్ నేతలు అనేక మంది ఉన్నా ఎంతటి ట్రాక్ రికార్డు ఉన్నా ఈ నియోజకవర్గంలో డైరెక్టర్ పదవే ఫైనల్. ఈ క్రమంలో ఇటీవల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గొట్టుముక్కల సూర్యనారాయణరాజును నియమించారు. ఆయన కూడా ఈ పదవి అక్కర్లేదని తేల్చి చెప్పారు. టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కడలి గోపాలరావు గతంలో జెడ్పీటీసీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పారీ్టలో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కట్టపెట్టారు. గోపాలరావు తనకు ఈ పదవి వద్దంటూ సోషల్ మీడియావేదికగా ప్రకటించారు. మొత్తం మీద ముగ్గురు నేతలు మూడు డైరెక్టర్ల పదవులు తిరస్కరించడం టీడీపీలోనే తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి నిమ్మల వ్యవహారంపైన విస్తృతంగా చర్చ సాగుతోంది.