breaking news
geeta workers
-
‘నీరా’ వచ్చేస్తోంది.. త్వరలో మార్కెట్లోకి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీరా ఉత్పత్తులు త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. నీరాను తీయడంతోపాటు అనుబంధ ఉత్పత్తుల తయారీకి అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్ సోమవారం విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని కల్లుగీత సహకార సొసైటీలు, తెలంగాణ గీత పారిశ్రామిక, ఆర్థిక సంక్షేమ సంస్థ, లేదా గౌడ, ఈడిగ కులాలకు చెందిన ఇతర సొసైటీల్లో సభ్యులుగా ఉన్న వారికి నీరా లైసెన్సులు ఇవ్వనున్నారు. లైసెన్సులు పదేళ్ల కాలం చెల్లుబాటు అవుతాయి. అనంతరం మళ్లీ వాటిని రెన్యువల్ చేస్తారు. నీరా ఉత్పత్తులను అమ్ముకునేందుకు మున్సిపాలిటీలు, పర్యాటక ప్రాంతాల్లో అనుమతివ్వనున్నారు. ఇందుకు సంబంధించి రిటైల్ ఔట్లెట్లను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కేవలం నీరాతోపాటు వాటి అనుబంధ ఉత్పత్తులైన తాటి బెల్లం, తాటి పంచదార లాంటి వాటిని కూడా లైసెన్సీలు తయారు చేసుకోవచ్చు. ప్రభుత్వ సహకార సంస్థలు, ప్రభుత్వం అనుమతిచ్చిన పరిశ్రమలకు కూడా నీరాను నాన్ ఆల్కహాలిక్ ఉత్పత్తుల తయారీకి ముడిసరుకుగా ఉపయోగించుకునేందుకు అమ్ముకునేలా లైసెన్సీలకు వెసులుబాటు ఇచ్చారు. అయితే నీరా లైసెన్సులు కేవలం నీరాను అమ్ముకునేందుకే వర్తిస్తాయి తప్ప కల్లు అమ్ముకునేందుకు వర్తించవని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించినా, నీరాను కల్తీ చేసేందుకు యత్నించినా సంబంధిత లైసెన్సులను రద్దు చేయనున్నారు. మార్గదర్శకాలతో కూడిన ప్రతులను మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు టి.హరీశ్‌రావు, కె. తారక రామారావు, వి.శ్రీనివాస్‌గౌడ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌లతోపాటు గౌడ కులానికి చెందిన ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్, ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పాలసీ ప్రతులను విడుదల చేస్తున్న మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్. చిత్రంలో సీఎస్ ఎస్కే జోషి, ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు ఎన్నికల హామీ మేరకు గౌడ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం నీరా పాలసీని ప్రకటించిందని, త్వరలోనే ప్రభుత్వ నీరా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లోనే మొదటి స్టాల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. 70 ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాలు గీత కార్మికులపై ఆంక్షలు పెట్టడమే కానీ వారి వృత్తికి సంబంధించిన ఎలాంటి సాయం చేయలేదన్నారు. నీరా పేరుతో ఇతర దేశాల్లో పర్యటించారు కానీ అమల్లోకి తేలేదని, గౌడ వృత్తిని కాపాడటం కోసం ‘హరితహారం’లో తాటిచెట్లను నాటిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. హైదరాబాద్‌లో నీరా అమ్మకాలకు అనుమతివ్వడం ఆనందంగా ఉందని, దశలవారీగా అన్ని జిల్లాల్లో అమ్మకాలు జరిగేలా చూస్తామన్నారు. నీరాను గీయడం, అమ్మడం కేవలం గౌడ కులస్తులే చేయాలని సీఎం చెప్పారని, ఈ మేరకు గౌడ కులస్తులకే నీరా లైసెన్సులిస్తామని చెప్పారు. నీరాలో అనేక ఔషధ గుణాలున్నాయని, షుగర్, మధుమేహ వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ నీరా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
‘ట్యాంక్‌బండ్ వద్ద తొలి నీరా స్టాల్’
ఆరోగ్యానికి మేలు చేసే పానీయంగా గుర్తింపు పొందిన నీరాను స్టాళ్ల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో తొలి స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. సాక్షి, హైదరాబాద్ : త్వరలో రాష్ట్ర రాజధానిలో నీరా స్టాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే పానీయంగా గుర్తింపు పొందిన నీరాను స్టాళ్ల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో త్వరలో తొలి స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఏర్పాటు చేసేందుకు ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం బేగంపేట పర్యాటక భవన్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. నీరా పానీయాన్ని జనానికి చేరువ చేస్తామని గతంలో ప్రభుత్వాలు పేర్కొన్నా.. మాట నిలబెట్టుకోలేదని, గీత కార్మికుల సంక్షేమ చర్యల్లో భాగంగా నీరా విక్రయించే స్టాళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. ఆరోగ్య ప్రదాయిని అయిన నీరా వల్ల సాధారణ ప్రజలకు మేలు కలగటమే కాకుండా, దాన్ని విక్రయించే స్టాళ్ల ఏర్పాటుతో గీత కార్మికులకు ఉపాధి మెరుగవుతుందని పేర్కొన్నారు. ఈ స్టాళ్ల బాధ్యతను గౌడ కులస్తులకే అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎంకు గౌడ కులస్తుల పక్షాన కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో ఔషధ గుణాలు నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని మంత్రి చెప్పారు. కంబోడియా, ఆఫ్రికాలోని పలు దేశాలు, ఇండోనేసియా, మలేసియా, శ్రీలంకలో దీని ఉత్పత్తి ఎక్కువగా ఉందని, ఇప్పుడిప్పుడే అమెరికాలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేరళ, మహారాష్ట్రల్లో నీరా విక్రయాలున్నాయని, తెలంగాణలో తొలిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టాల్స్ అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. అన్ని కులాల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నామని, హైదరాబాద్‌లో ఆయా కులాలకు సంక్షేమ భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. -
సర్కస్ ఫీట్లు కాదు..బతుకు పాట్లు
కొనకనమిట్ల (ప్రకాశం) : నాలుగు రూపాయలు సంపాదించాలంటే సాహసం చేయాలి. యాభై అడుగుల ఎత్తున్న తాటిచెట్లు ఎక్కి తాటాకు కొట్టాలంటే అంతకు మించి ధైర్యం ఉండాలి. కొనకనమిట్ల మండలంలో ఎక్కువగా తాటాకు వ్యాపారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కూలీల చేత తాటాకు కొట్టిచ్చి దానిని గుంటూరు, విజయవాడ లాంటి నగరాలకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో చినమనగుండం, లింగంగుంట గ్రామాలకు చెందిన వెంకటేశ్వర్లు, బాలయ్యలు ఎంతో ధైర్యంగా చెట్లు ఎక్కి తాటాకు కొడుతున్నారు. ఇక్కడ విశేషమేంటంటే చెట్టు దిగకుండా కర్ర సాయంతో పాకుకుంటూ మరో చెట్టుకు చేరి ఆకు దించుతారు. పొట్టకూటి కోసం ఇలాంటి పనులు చేయక తప్పదని వెంకటేశ్వర్లు, బాలయ్యలు అంటున్నారు.