● వంటావార్పులో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
కమలాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏమయ్యాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై బీఆర్‌ఎస్ చేపట్టిన పోరుబాటలో భాగంగా శుక్రవారం కమలాపూర్‌లో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి కౌశిక్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బస్టాండ్ కూడలి వరకు బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ బాకీ కార్డులు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో వంటావార్పు కార్యక్రమాన్ని ప్రారంభించి భోజనాలు వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కమలాపూర్‌లో రూ.1.75 కోట్లతో కేసీఆర్ బస్టాండ్ పనులు ప్రారంభిస్తే మరో రూ.కోటి కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలని అసెంబ్లీ సాక్షిగా తాను ఎన్నోసార్లు కొట్లాడినా ఇప్పటి వరకు పట్టించుకోని వారికి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు.
కేసీఆర్‌పై నోటికొచ్చినట్లు
మాట్లాడితే తాట తీస్తాం..
కేసీఆర్‌పై మాట్లాడే నైతిక హక్కు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటికి లేదని, కేసీఆర్, కేటీఆర్ హరీశ్‌రావుపై నోటికొచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. రూ.20 కోట్లతో కమలాపూర్, గూడూరు, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించి వారం రోజుల్లో లబ్ధిదారులను డబుల్ ఇళ్లల్లోకి పంపిస్తామన్నారని, ఇన్ఫ్రాస్టక్చర్ కోసం రూ.4.92 కోట్లు మంజూరు చేసినప్పటికి ఇప్పటికి టెండర్ వేయకుండా దాట వేస్తున్న చేతగాని దద్దమ్మ పొంగులేటి అని ఎద్దేవా చేశారు. మీరు ఎక్కడకు చర్చకు వస్తారో రావాలని, కేసీఆర్ చేసిన అభివృద్ధి కంటే ఒక్క రంగంలో మీరు ఎక్కువ చేసిన అభివృద్ధిని చూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తానని, లేకుంటే మీరు క్షమాపణ చెబుతారా? అని సవాల్ విసిరారు. కార్యక్రమాల్లో పీఏసీఎఎస్ చైర్మన్ సంపత్‌రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షడు రాజేశ్, నాయకులు లక్ష్మణ్‌రావు, నవీన్‌కుమార్, శ్రీనివాస్, కృష్ణప్రసాద్, రమేశ్, పలు గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


