ఎగుమతుల బాటలో ఓరుగల్లు ఉత్పత్తులు
వరంగల్
బ్రాండ్..
సాక్షి, వరంగల్: చేనేత, టెక్స్‌టైల్, వ్యవసాయ ఉత్పత్తులతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందిన జిల్లా.. ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేందేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పంపిన ఎక్స్‌పోర్ట్ హబ్ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే జిల్లా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడనుంది. స్థానిక చేనేత ఉత్పత్తులతోపాటు మామిడి, మొక్కజొన్న, వరి, పత్తి వంటి వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లను అనుసంధానం చేస్తే జిల్లాలోని వేలాది కుటుంబాలకు ఉపాధి, ఆదాయం మరింత పెరిగే అవకాశముంది. ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, బ్రాండింగ్, ప్యాకేజింగ్, నిల్వ, కోల్డ్‌స్టోరేజీ, రవాణా, అంతర్జాతీయ మార్కెటింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తే స్థానిక ఉత్పత్తుల విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, కాన్పూర్ వంటి దేశీయ మార్కెట్లకు చేరుతున్న వరంగల్ ఉత్పత్తులు.. భవిష్యత్‌లో అంతర్జాతీయ మార్కెట్లకు చేరుతాయి. కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తే చేనేత, టెక్స్‌టైల్, వ్యవసాయ ఉత్పత్తుల సమ్మిళిత ఎగుమతి కేంద్రంగా వరంగల్ కొత్త పారిశ్రామిక అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది.
రూ.40.25 కోట్ల చేనేత వ్యాపారం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 92 చేనేత, మ్యాక్స్ సొసైటీలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా సుమారు రూ.40.25 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతోంది. రూ.17.50 కోట్ల విలువైన సుమారు ఐదు లక్షల కార్పెట్లు ఉత్పత్తి అవుతున్నాయి. అలాగే, 5.50 లక్షల బెడ్‌షీట్లు ఉత్పత్తి చేసి రూ.19.25 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఇక షర్టింగ్ విభాగంలో సుమారు 1.60 లక్షల మీటర్ల ఉత్పత్తి ఉండగా రూ.1.27 కోట్లు, టవల్స్ 80 వేల వరకు ఉత్పత్తి అవుతుండగా రూ.92 లక్షల వ్యాపారం జరుగుతోంది. డోర్ మ్యాట్స్, కలంకారి, ఇంటర్‌లాక్, పట్టుచీరలు తదితర ఉత్పత్తుల ద్వారా మరో రూ.1.31 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. వరంగల్‌లోని కొత్తవాడ, కమలాపూర్, శాయంపేట మండలాల్లో బెడ్‌షీట్లు, కార్పెట్ల ఉత్పత్తి అధికంగా ఉండగా.. జనగామ, మహదేవపూర్ ప్రాంతాల్లో పట్టుచీరల తయారీకి ప్రాధాన్యం ఉంది. మొత్తంగా సుమారు 7,500 కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి.
మెగా టెక్స్‌టైల్ పార్కుతో కొత్త ఊపు..
చేనేతకు తోడు జిల్లాలో టెక్స్‌టైల్ రంగం వేగంగా విస్తరిస్తోంది. మడికొండ, రాంపూర్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు పరిధిలో రెడీమేడ్ దుస్తుల తయారీకి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌వన్‌న్ సంస్థ ఇక్కడ తయారయ్యే కాటన్‌న్ టీషర్టులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కేరళకు చెందిన కై టెక్స్ సంస్థ చిన్నపిల్లల రెడీమేడ్ దుస్తుల తయారీ రంగంలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గణేశ్ ఎకోటెక్ వంటి సంస్థలు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి దారం తయారు చేసే ప్రక్రియలో ఉన్నాయి. దీంతో వరంగల్ టెక్స్‌టైల్ పరిశ్రమకు ఉత్పత్తి నుంచి ఎగుమతి వరకు ఏటా రూ.వందల కోట్లలో వ్యాపారం జరుగుతోంది.
మామిడి, ఇతర పంటలకు అంతర్జాతీయ మార్కెట్..
జిల్లాలో 5,964 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. 2025–26 సీజన్‌న్‌లో 1,16,878 క్వింటాళ్ల మామిడి దిగుబడి వచ్చినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇందులో 72.867 క్వింటాళ్ల సరుకును ఢిల్లీ, మధ్యప్రదేశ్, బిహార్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. స్థానిక మామిడికి ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే మార్కెట్ ఉంది. కోల్డ్ స్టోరేజీ, ప్యాకింగ్, గ్రేడింగ్, రవాణా సదుపాయాలు పెంచితే విదేశీ మార్కెట్లకు కూడా విస్తరించే అవకాశం ఉంది. మొక్కజొన్న 18,966 ఎకరాల్లో సాగవుతుండగా సుమారు 4.82 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. 69,542 ఎకరాల్లో వరి, 1,20,044 ఎకరాల్లో పత్తి సాగవుతుండగా లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీంతో వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, ఎగుమతి పరిశ్రమల విస్తరణతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండనున్నాయి.
చేనేత, టెక్స్‌టైల్, మామిడి, పత్తి, వరి తదితరపంటలకు ప్రాధాన్యం
‘ఎక్స్‌పోర్ట్ హబ్’కు కేంద్రం ప్రతిపాదనలు
రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే పెరగనున్న ఉపాధి అవకాశాలు, ఆదాయం


