రేషన్‌ దుకాణాలకు చేరని నిల్వలు | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ దుకాణాలకు చేరని నిల్వలు

Jul 31 2026 1:27 AM | Updated on Jul 31 2026 1:27 AM

జిల్లాలో రవాణా ఇలా.. ఒక్కో బస్తాలో రెండు కిలోల తరుగు

సజావుగా సాగుతుందా?

ఒకే కాంట్రాక్టర్‌ ఆధిపత్యమా?

ఆగస్టు 1న జిల్లాలోని అన్ని రేషన్‌ దుకాణాలకు మూడు నెలల కోటా బియ్యం చేరాల్సి ఉంది. ప్రస్తుతం సరఫరా మందగించడం వల్ల రేపటి నుంచి పంపిణీ సజావుగా సాగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో నిబంధనల ప్రకారం ప్రతీ బస్తాకు తూకం వేసి, పారదర్శకంగా రేషన్‌ దుకాణాలకు సరఫరా చేయాలని, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేషన్‌ డీలర్లు, లబ్ధిదారులు కోరుతున్నారు.

హన్మకొండ అర్బన్‌: వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని ఆగస్టులో పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, జిల్లాలో ఇప్పటికీ అనేక రేషన్‌ దుకాణాలకు బియ్యం చేరలేదు. బియ్యం రవాణా, తూకం ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని రేషన్‌ డీలర్లు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో ప్రతి నెలా భారీ మొత్తంలో బియ్యం దారి మళ్లుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 414 రేషన్‌ దుకాణాలు, 2,57,815 రేషన్‌ కార్డులు, 7,76,498 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెలా 48,74,027 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా.. ఈసారి ఆగస్టులో 3 నెలల కోటాగా 1,46,22,081 కిలోల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది.

హనుమకొండ జిల్లాలో రేషన్‌ బియ్యం సరఫరా రెండు మండల స్థాయి నిల్వ కేంద్రాల ద్వారా జరుగుతోంది. ఒకటి హనుమకొండ, మరొకటి పరకాల కేంద్రంగా పనిచేస్తున్నాయి. హనుమకొండ నిల్వ కేంద్రం పరిధిలో 265 రేషన్‌ దుకాణాలు ఎనిమిది మండలాల్లో ఉండగా.. పరకాల నిల్వ కేంద్రం పరిధిలో 149 రేషన్‌ దుకాణాలు ఆరు మండలాల్లో ఉన్నాయి. రాష్ట్ర గిడ్డంగులు, భారత ఆహార సంస్థ గిడ్డంగుల నుంచి బియ్యాన్ని మండల స్థాయి నిల్వ కేంద్రాలకు తరలించే బాధ్యత మొదటి దశ కాంట్రాక్టర్‌ది. అక్కడి నుంచి రేషన్‌ దుకాణాలకు సరఫరా చేసే బాధ్యత రెండో దశ కాంట్రాక్టర్‌ది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతీ నెల 15వ తేదీ తర్వాత రవాణా ప్రారంభమై నెలాఖరులోగా పూర్తవ్వాలి. అప్పుడే తదుపరి నెల 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు పంపిణీ సజావుగా సాగుతుంది.

నిబంధనల ప్రకారం మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో ప్రతఅఈ 50 కిలోల బియ్యం బస్తాను తూకం వేసిన అనంతరం రెండో దశ వాహనాల్లో ఎక్కించి రేషన్‌ దుకాణాలకు పంపాలి. కానీ.. ఆ ప్రక్రియను పాటించకుండా మొదటి దశ వాహనాల నుంచి నేరుగా రెండో దశ వాహనాల్లోకి బస్తాలను మార్చి పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఒక్కో బస్తాలో రెండు కిలోల వరకు బియ్యం తక్కువగా ఉంటోందని, ఈ నష్టం చివరకు డీలర్లపై పడుతోందని వారు చెబుతున్నారు. గతంలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లోనూ బస్తాల బరువులో తేడాలు బయటపడినప్పటికీ, ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆరోపిస్తున్నారు.

మొదటి, రెండో దశ రవాణా పనులు వేర్వేరు కాంట్రాక్టర్ల ద్వారా నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం ఒకే వ్యక్తి ఆధిపత్యం కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. తగిన సంఖ్యలో వాహనాలు ఏర్పాటు చేయకపోవడంతో బియ్యం సరఫరాలో జాప్యం జరుగుతోందని, కొందరు డీలర్లకు ముందుగా, మరికొందరికి ఆలస్యంగా బియ్యం పంపుతూ వివక్ష చూపుతున్నారని చెబుతున్నారు. ప్రశ్నించిన డీలర్లకు మరింత ఆలస్యంగా బియ్యం పంపించడం, వాహనాలను దుకాణాలకు దూరంగా నిలిపివేయడం వంటి ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని ఆరోపిస్తున్నారు.

హమాలీల అదనపు డిమాండ్‌పై ఆరోపణలు

జిల్లాలో 414 రేషన్‌ దుకాణాలు

7,76,498 మంది లబ్ధిదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement