కాశిబుగ్గ: స్టైఫండ్ పెంచాలని కోరుతూ తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో హౌస్‌సర్జన్లు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ నిరసన చేపట్టారు. ఆయుష్ హౌస్‌సర్జన్లు అల్లోపతిక్ హౌస్‌సర్జన్లతో సమానంగా రోగులు సేవలు అందిస్తూ, అత్యవసర విధులు, వార్డులు, ఓపీలను సమర్థంగా నిర్వహిస్తున్నప్పటికీ స్టైఫండ్ విషయంలో వివక్ష చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్టైఫండ్‌తోపాటు బకాయిలను విడుదల చేసి, ప్రతినెలా సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్–రక్సోల్–హైదరాబాద్ మధ్య సర్వీసులను పునరుద్ధిరించి నడిపిస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. గతంలో రైళ్ల సర్వీసులను సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో చక్రధపూర్ డివిజన్‌లో మెగా రైల్వే బ్లాక్ కారణంగా రద్దు చేశారు. తిరిగి ఈ సర్వీసులను దసరా, దీపావళి, చాత్ పూజా పండుగలు ఉన్న దృష్య్టా ప్రయాణికుల సౌకర్యార్థం తిరిగి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.
రైళ్ల వివరాలు ఇలా..
అక్టోబర్ 8, 15, నవంబర్ 5, 12 తేదీల్లో హైదరాబాద్–రక్సోల్ (17005) వెళ్లే ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా అక్టోబర్ 11, 18, నవంబర్ 8, 15 తేదీల్లో రక్సోల్–హైదరాబాద్ (17006) వెళ్లే ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు చేరుకొని వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీసులకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, కాజీపేట జంక్షన్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించారు.
కేయూ క్యాంపస్: హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగ సంఘం (టీయూఎన్‌టీఈఏ) సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి ముగ్గురికి ప్రాతినిథ్యం లభించింది. టీయూఎన్‌టీఈఏ వర్కింగ్ ప్రసిడెంట్‌గా వల్లాల తిరుపతి, ఉపాధ్యక్షుడిగా బూర నవీన్, జాయింట్ సెక్రటరీగా తాటి దామోదర్ ఎన్నికయ్యారు.
ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక ఆధ్వర్యంలో గురువారం మార్కెట్ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జరిగిన క్రయ విక్రయాలను ఆమె పరిశీలించారు. ముఖ్య అతిథిగా ప్రియాంక హాజరై మాట్లాడుతూ.. మార్కెట్ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో స్థలాన్ని పరిశీలిస్తామని, పలు అంశాలపై చర్చించి నివేదికను తయారు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీనివాస్, వైస్ చైర్మన్ బండి జనార్దన్, డైరెక్టర్లు గజ్జెల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ: హనుమకొండ జిల్లాలో మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉంది. గురువారం రోజంతా ముసురు కురిసింది. వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. నారు పోసుకుని సిద్ధంగా ఉన్న రైతులు నాటు వేసేందుకు పొలాన్ని తయారు చేస్తున్నారు. గురువారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల వరకు అటోమేటిక్ వెదర్ స్టేషన్‌లో నమోదైన వర్షపాతం వివరాలను ప్రణాళిక శాఖ విడుదల చేసింది. పరకాలలో 16.8 మిల్లీమీటర్లు, కమలాపూర్‌లో 15.3, మరిపల్లి గూడెంలో 14.5, దామెర మండలం పులుకుర్తిలో 13.3, శాయంపేటలో 12.8, భీమదేవరపల్లి 12.5, ఎల్కతుర్తిలో 12.3, హసన్‌పర్తి నాగారంలో 10.3, నడికూడలో 10, హసన్‌పర్తి చింతగట్టులో 8.3, ఆత్మకూరులో 7.8, దామెరలో 7.5, వేలేరులో 6.5, ధర్మసాగర్‌లో 6.3, కాజీపేటలో 4, మడికొండలో 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


