‘మధ్యవర్తితం 3.ఓ’ విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘మధ్యవర్తితం 3.ఓ’ విజయవంతం చేయాలి

Sep 20 2026 12:39 AM | Updated on Sep 20 2026 12:39 AM

వనపర్తి: దేశ అత్యున్నత న్యాయస్థానం కల్పించిన మధ్యవర్తిత్వ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని.. అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు నిర్వహించనున్న మధ్యవర్తిత్వ 3.ఓ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ న్యాయమూర్తిబాకరాజు శ్రీనివాసరావు కోరారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీమార్గం అనేది రామాయణ, మహాభారత కాలం నుంచే ఉన్నాయని, రామాయణ కాలంలో అంగధుడు, మహాభారత కాలంలో శ్రీ కృష్ణుడు మహాయుద్ధాలను ఆపేందుకు రాజీమార్గంలో ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 89 కింద పరిగణించబడిన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతుల్లో మధ్యవర్తిత్వం ఒకటని.. వివాదంలో ఉన్న పక్షాలు విచారణకు వెళ్లకుండా సృజనాత్మకంగా పరిష్కరించుకోవడానికి సహాయపడుతుందన్నారు. జిల్లాలో 15 మంది శిక్షణ పొందిన మధ్యవర్తులు ఉన్నారని, వైవాహిక వివాదాలు, వినియోగదారుల వివాదాలు, ఆస్తి భూ వివాదాలు, కుటుంబ, ఆర్థిక వివాదాలు కోర్టులో ఉన్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోర్టుకు వచ్చి మధ్యవర్తిని కల్పించండని కోరితే వెంటనే నియమిస్తామన్నారు. ఆ మధ్యవర్తి ఇరు వర్గాలతో సంప్రదింపులు జరిపి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించిన అనంతరం కోర్టు పరిష్కారం చేస్తుందని తెలిపారు. రాజీకి ఆస్కారం ఉందని కోర్టుకు అనిపిస్తే న్యాయమూర్తి ఆ కేసును మధ్యవర్తిత్వానికి పంపుతారని చెప్పారు. ఈ సందర్భంగా తను కరీంనగర్‌లో పనిచేసే సమయంలో భార్యాభర్తలు చిన్న విషయానికి విడాకులు తీసుకునేందుకు వస్తే కౌన్సిలింగ్‌ ఇచ్చి రాజీ కుదిర్చానని, ఆమె ఒకరోజు అనుకోకుండా కలిసి కన్నీళ్లు పెట్టుకుంటూ జీవితాన్ని బాగుచేశారని చెప్పిన ఘటన చాలా సంతృప్తినిచ్చిందని గుర్తు చేసుకున్నారు. సమావేశంలో న్యాయమూర్తులు కోట్ల లావణ్య, బాల్‌రెడ్డి, జి.కళార్చన, కవిత, బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, కార్యదర్శి వెంకటరమణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప కాసరగడ్డ, శిక్షణ పొందిన మధ్యవర్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement