బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు నాశనం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు నాశనం

Sep 21 2026 12:50 AM | Updated on Sep 21 2026 12:50 AM

ఊకచెట్టు వాగు వంతెన

ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి

మదనాపురం: తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు జిల్లా సర్వనాశనం అయిందని.. నాటి పాలకుల ద్రోహం, నిర్లక్ష్యానికి ఊకచెట్టు వాగు వంతెనే సజీవ సాక్ష్యమని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రూ.15.25 కోట్లతో ఆత్మకూరు–కొత్తకోట మధ్య ఉన్న ఊకచెట్టు వాగుపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి ఆదివారం ఆయనతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ కమీషన్ల కక్కుర్తితోనే అమాయకుల ప్రాణాలు పోయాయని, వంతెన పనులు పిల్లర్లకే పరిమితం చేయడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి నలుగురు పేదలు ప్రాణాలు వదిలినా నాటి కేసీఆర్‌ ప్రభుత్వానికి కనీసం చలనం రాలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే జీఎంఆర్‌ అభ్యర్థన మేరకు మదనాపురం, కౌకుంట్ల, మూసాపేట మండలాల్లో రూ.49 కోట్లతో సమీకృత మండల కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్‌, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని వివరించారు. శ్రీ కురుమూర్తిస్వామి ఆలయానికి రూ.110 కోట్లతో ఘాట్‌ రోడ్డు, రూ.143 కోట్లతో అనుసంధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నామని.. భూత్పూర్‌ పురపాలికకు రూ.30 కోట్లు కేటాయించామని, దేవరకద్రలో 100 పడకల ఆస్పత్రి, కోర్టు భవనం, పుర కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నామని, ప్రజా ప్రభుత్వంలో విద్యార్థుల కాస్మోటిక్‌, డైట్‌ చార్జీలను 40 శాతం పెంచి పేద పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement