కొత్తకోట రాఘవేంద్రకాలనీ, బీసీకాలనీలో నిలిచిన నిర్మాణాలు
న్యాయస్థానం పరిధిలోని అంశం..
● అనుమతి ఇవ్వని అధికారులు
● ప్లాట్లు క్రయవిక్రయాలకు బ్రేక్
● 50 ఏళ్లుగా నివాసం..
650కు పైగా ఇళ్లు
●
కొత్తకోట: స్థానిక పుర పరిధిలోని రాఘవేంద్రకాలనీ, బీసీకాలనీలో మూడేళ్ల కిందట నమోదైన టెనెంట్ కేసు కారణంగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభించకపోవడంతో ఆయా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 650కి పైగా కుటుంబాలు ఆయా కాలనీల్లో నివాసం ఉంటున్నాయి. సర్వేనంబర్లు 335, 339, 352, 352/1, 352/2లో సుమారు 20 ఎకరాలకుపైగా ఉన్న కాలనీల్లో టెనెంట్ కేసు కారణంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత స్థలాలు ఉన్పప్పటికీ ఇళ్ల నిర్మాణాలకు సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నారు. పాత ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మించుకోవాలనుకున్నా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. విద్య, వైద్యం తదితర అత్యవసర ఖర్చుల కోసం ప్లాట్లను విక్రయించుకోవాలనుకున్నా కేసు ప్రభావంతో కొనుగోలుదారులు ముందుకురావడం లేదని చెబుతున్నారు.
అధికారుల తప్పిదమేనా..?
కొందరు అధికారుల తప్పిదం కారణంగానే తప్పుడు కేసు నమోదైందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అధికారుల స్థాయిలో జరిగిన తప్పిదం ఉంటే దాన్ని సరిదిద్దకుండా ఏళ్ల తరబడి సమస్యను కొనసాగించడంతో సామాన్య ప్రజలు నష్టపోతున్నారని వారు అంటున్నారు. జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి టెనెంట్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించి వాస్తవ పరిస్థితిపై సమగ్ర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 50 ఏళ్లుగా నివసిస్తున్న 650కు పైగా కుటుంబాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా సమస్య శాశ్వతకు పరిష్కారం చూపాలని ఆయా కాలనీవాసులు కోరుతున్నారు.
రాఘవేంద్రకాలనీకి సంబంధించిన టెనెంట్ కేసు న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉంది. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశంపై నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కేసు వివరాలు, రెవెన్యూ రికార్డులు, పుర నిబంధనల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చట్ట పరిధిలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. – సైదయ్య, పుర కమిషనర్


