నేడు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన..
జూరాల కాల్వలకు నీటి విడుదలపై స్పష్టత కరువు
కాల్వ వద్ద పటిష్ట బందోబస్తు..
● ఆందోళనలు, రాస్తారోకోలతో వేడెక్కిన జల వివాదం
● సోమవారం ప్రాజెక్టుపై ఆందోళనకు పూనుకున్న బీఆర్‌ఎస్
● తాగునీటికే ప్రాధాన్యమంటున్న ప్రభుత్వం
–8లో u
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కాల్వలకు సాగునీటి సరఫరా నిలిపివేయడంతో అటు ఆయకట్టు రైతులు, ఇటు ప్రాజెక్టు అధికారుల మధ్య జల జగడం మొదలైంది. ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలంటూ ప్రాజెక్టుపై నాలుగు రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా.. సంబంధిత ప్రాజెక్టు అధికారులు మాత్రం సాగునీరు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధంతో పాటు ప్రాజెక్టుపై ఆందోళన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. పంటలు ఎండుముఖం పట్టాయని ఆవేదనకు గురైన రైతులు ఏకంగా ఆందోళన సమయంలోనే అధికారుల ఎదుటే ప్రధాన ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటరీ షట్టర్ల తాళాలు పగులగొట్టి కాల్వకు సాగునీటిని విడుదల చేయడంతో సమస్య తీవ్రమైంది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రభుత్వం ప్రధాన ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటరీ వద్ద పోలీసు బెటాలియన్‌తో పహార ఏర్పాటు చేసి కాల్వకు సాగునీటి సరఫరాను నిలిపివేసింది. వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తారని ఆశించిన రైతుల ఆశలను ప్రాజెక్టు అధికారులు పూర్తిగా తుడిచేయడంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికందదని రైతులు ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఆయకట్టు పరిధిలో 1.20 లక్షల ఎకరాలు..
వానాకాలం సీజన్‌లో జూరాల ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాల్వల పరిధిలో రైతులు 1.20 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేశారు. అధికంగా వరి సాగుకాగా.. అక్కడక్కడ ఆరుతడి పంటలు సాగయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం.. ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుతం జలాశయంలో 5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండటంతో అధికారులు సాగు నీటి సరఫరాను ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే పూర్తిగా నిలిపివేశారు. దీంతో వరి సాగుచేసిన రైతులు తమ పంటలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వంతో పాటు అధికారుల వైఖరిని వ్యతిరేకిస్తూ ఆందోళనబాట పట్టారు.
జూరాల ఆయకట్టుకు సాగునీటిని వదలాలంటూ సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ప్రాజెక్టు వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. రైతుల పక్షాల పోరాటం చేసి అండగా నిలిచేందుకు ఆందోళనకు పూనుకున్నాయి. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హాజరుకానున్నారని.. ఆయకట్టు పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని అన్ని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో రైతులను తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటరీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముందస్తుగా పోలీసు బలగాలతో పహారా నిర్వహిస్తున్నారు. రైతులు ఆందోళనకు వస్తే వారిని నివారించేందుకు వీలుగా బలగాలను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం రైతుల ధర్నాలతో జూరాల ప్రాజెక్టు ధర్నా చౌక్‌గా మారింది.


