రాజోళి: జిల్లాలో తుంగభద్ర నది తీరంలో, ఆర్డీఎస్ కెనాల్ కింద వేల ఎకరాలు సాగు చేస్తారు. కానీ ఈ రెండు వనరుల కింద సాగు చేయాలంటే ప్రధానంగా తుంగభద్ర నదిలో నీరు ఉండాలి. గతంలో నదిలో నీరున్నా ఎగువ నుంచి ఆర్డీఎస్ కెనాల్‌కు నీరు అందేది కాదు. ప్రస్తుతం తుమ్మిళ్ల ఎత్తిపోతల అందుబాటులో ఉండటంతో నదికి నీరు వస్తే ఆర్డీఎస్ కెనాల్‌కు నీరు తీసుకునే వెసలుబాటు ఉంది. తుంగభద్రకు నీరు వస్తే అటు నది తీరంలో వేసిన పంటలకు, ఇటు ఆర్డీఎస్ కెనాల్ కింద సాగు చేసిన పంటలకు నీటికి కొదవ ఉండదు. కానీ తుంగభద్ర నది ప్రస్తుతం నీరు లేక వెలవెలబోవడంతో జిల్లాలోని వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. వానాకాలంలో వేసిన పత్తి, మిరప తదితర పంటలకు ఆర్డీఎస్ కెనాల్ కింద నీరు అందాల్సి ఉండగా.. ఆరంభంలో 20 రోజుల పాటు తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా అందించారు. అనంతరం నదిలో నీరు లేకపోవడంతో మోటార్లు ఆఫ్ చేశారు. నది తీరంలో ఎక్కువగా వరి నాట్లు వేయడంతో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి కోసం అధికారులకు, నాయకులకు ఫోన్ చేస్తూ ప్రస్తుతం నీరు ఎక్కడి దాకా వచ్చింది.. మన దగ్గరకు వచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుందని లెక్కలు వేసుకుంటూ, నీటి రాక కోసం ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇలా ఉండగా.. కర్ణాటక పరిధిలో ఉన్న ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటరీ 12 ఎగువన పంటలకు సాగునీరు అందిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై రైతులకు కూడా సమాచారం అందడంతో, తమకు కూడా నీరు వస్తుందనే ఆశలు రెట్టింపు చేసుకుని ఎదురుచూస్తున్నారు. ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద సోమవారం రాత్రి సమయానికే 3.5 ఫీట్ల మేర నీరు ఉన్నట్లు సమాచారం. కానీ అధికారులు మాత్రం ధ్రువీకరించడం లేదు. కర్ణాటకలోని సిరిగుప్ప, బళ్లారి తదితర జిల్లా పరిధిలో అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం గత వారంలో ఆర్డీఎస్ నీరు వదలాలని నిరసన తెలపడంతో తాగునీటి పేరుతో ఆయకట్టుకు సాగునీరు వదిలినట్లు సమాచారం. కానీ జిల్లాలోని అధికారులు దీనిపై నోరు మెదపడం లేదు.
94.817 టీఎంసీల నిల్వ
ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 94.817 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది ఇలాగే కొనసాగుతూ.. 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటేనే దిగువకు నీరు వదులుతారు. కానీ డ్యాంకు కేవలం 8,760 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా 8,500 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారని సమాచారం. ఒకవేళ అదే స్థాయి నీరు వదిలినా ఆశించిన స్థాయిలో జిల్లాకు వరద చేరకపోచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ఎగువన ఉన్న రైతులు ఎప్పటికప్పుడు మోటార్లతో నీటిని తోడేస్తుండడంతో వచ్చే కొద్దిపాటి నీరు సైతం జిల్లా అందేలా లేదు. రైతులు జిల్లా కేంద్రానికి వెళ్లి అధికారులను కలిసినా సాగునీటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని వాపోతున్నారు.
నది నీరు వస్తేనే..
సోమవారం రాత్రి ఆర్డీఎస్ ఆనకట్ట వరకు వరద వచ్చిందని అధికారులు అంటున్నారు. ఎగువ ప్రాంతంలో తెలిసిన వారిని అడిగితే మాధవరం దగ్గరలో కొద్దిపాటి వరద నీరు వస్తుందని, మా దాకా వచ్చేందుకు మరో నాలుగు రోజులు పట్టొచ్చన్నారు. మిరప, వరి సాగు చేశాను. నదికి నీరు వస్తేనే పంటలు బతుకుతాయి.
– విక్రమ్‌సింహారెడ్డి, రైతు, చిన్న ధన్వాడ
తుమ్మిళ్ల సమాచారం కోసం..
తుమ్మిళ్లలో మోటార్ ఆన్ చేస్తేనే ఆర్డీఎస్ కెనాల్‌కు నీరు అందుతుంది. దాని కోసం రోజూ విలేకరులు, నాయకులకు ఫోన్ చేస్తున్నాం. ప్రస్తుతం తడులు అందకుంటే పంటకు ఉన్న కొద్ది ప్రాణం కూడా పోతుంది. నదికి నీరు వచ్చి తుమ్మిళ్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారనే సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం.
– గోపాల్,
గోకులపాడు, మానవపాడు మండలం
ఎలాంటి సమాచారం లేదు
ఎగువ నుంచి నీరు వస్తున్నట్లు మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం నదిలో నీరు అడుగంటింది. తుమ్మిళ్ల మోటార్‌కు కూడా అందవు. టీబీ డ్యాంలో నిల్వలు తప్ప మిగతా ఎలాంటి సమాచారం లేదు. ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే రైతులకు తెలియచేస్తాం.
– రామదాసు, ఆర్డీఎస్ అధికారి
తుంగభద్ర నది నీటికి జిల్లా రైతుల ఎదురుచూపులు
సమాచారం కోసం అధికారులు, మీడియాకు ఫోన్లు
ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద 3.5 ఫీట్ల మేర నీరు?
కర్ణాటక పరిధిలో తాగునీటి పేరుతో సాగునీరు విడుదల
తుమ్మిళ్ల లిఫ్టు నిలిచి నెల దాటింది


