మదనాపురం మార్కెట్‌ పీఠం ఎవరికో? | - | Sakshi
Sakshi News home page

మదనాపురం మార్కెట్‌ పీఠం ఎవరికో?

Aug 27 2026 12:48 AM | Updated on Aug 27 2026 12:48 AM

మదనాపురం: మదనాపురం మార్కెట్‌ పాలకవర్గ పదవీకాలం జులై 18 నాటికి ముగిసింది. ఈసారి చైర్మన్‌ పీఠం జనరల్‌ కేటగిరికి కేటాయించడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. అయితే పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా శ్రమించిన నిజమైన నాయకుడికే ఈ పదవిని కట్టబెట్టాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

రేసులో ముగ్గురు సీనియర్లు..

మండల రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌పార్టీ జెండాను మోసిన ముగ్గురు సీనియర్‌ నాయకులు చైర్మన్‌ రేసులో ఉన్నట్లు సమాచారం. కేవలం పదవి ఆశించే వారి కంటే పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉన్న వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యే ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో నాటి పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమించిన, మొదటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ఎలాంటి వివాదాలకు తావులేకుండా పార్టీ ప్రయోజనాలే ముఖ్యం అనుకున్న నిజమైన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం చెమటోడ్చిన నిజమైన కార్యకర్తకే ఈ పదవిని కేటాయించడంతో పార్టీలో కొత్త జోష్‌ నింపాలనే వ్యూహాత్మకంగా జీఎంఆర్‌ అడుగులు వేస్తున్నారు. చైర్మన్‌ పీఠం ఎవరిని వరించనుందనే విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది.

రైతుల ఆర్థిక జీవనాడి..

మార్కెట్‌యార్డు కేవలం ఒక వ్యాపార కేంద్రం మాత్రమే కాదు.. ఈ ప్రాంత రైతులకు అండగా నిలిచే ఒక ఆర్థిక జీవనాడి. స్థానిక రైతులు తమ కష్టార్జితాన్ని దళారుల చేతిలో పెట్టి మోసపోకుండా విక్రయించుకోవడానికి ఈ మార్కెట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉమ్మడి జిల్లాలోనే కీలక వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొంది ఈ ప్రాంతంలోని వేలాది మంది రైతులు, స్థానిక వ్యాపారులకు ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా తోడ్పాటునందిస్తోంది. నూతన పాలకవర్గం మార్కెట్‌లో మౌలిక వసతుల కల్పనతో పాటు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement